Kids

అణకువే ఆభరణం

Humility Is The Greatest Jewellery

?మనిషికి అణకువ- పెట్టని ఆభరణం కావాలి. అణకువతో ఉండేవారినే అందరూ అభిమానిస్తారు. ఆదరిస్తారు. ఒదిగి ఉండే వారిముందే లోకమూ ఒదుగుతుంది.జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు, ముందుగా అణకువ అలవరచుకోవాలి.

అందరితో కలిసి పనిచేసుకుపోవాలి. కొంతమందితో పొరపొచ్చాలు ఏర్పడటం అతి సహజం. అప్పుడే శాంతం అవసరమవుతుంది.

ఎటువంటి పరిస్థితులైనా నిదానంగా చక్కబడతాయి. సృష్టిని నిశితంగా గమనిస్తే- మధుర ఫలాలనిచ్చే వృక్షాలు, సుగంధభరిత పుష్పాలతో తలలూపే మొక్కలు, తీయని జలాలనిచ్చే నదులు గోచరిస్తాయి. అందానికి, ఆనందానికి పర్యాయపదాలుగా నిలిచే ప్రాణులూ కనిపిస్తాయి.

వాటితో పాటు మానవ మనుగడకు సహాయకారులైన ఏవీ మిడిసిపడవు. తాము లేకుంటే ప్రకృతి స్తంభించిపోతుందని అహంకరించవు.

బుద్ధిజీవులుగా ఉండాల్సిన మానవులే పలు అసమానతలు సృష్టించుకొంటున్నారు. జీవన మాధుర్యాన్ని, మనశ్శాంతిని కోల్పోతున్నారు. పిల్లలు అణకువతో ఉంటే, తల్లిదండ్రులు మురిసిపోతారు. శిష్యుడు బుద్ధిగా, అణకువతో ఉంటే గురువు అతడికి సమస్త విద్యలూ బోధిస్తాడు.

తనంతటివాణ్ని చేయాలని ఆరాటపడతాడు. గురువును మించిన శిష్యుడని లోకులు పొగుడుతుంటే, గురువు ఎంతో పొంగిపోతాడు.

సభలో పదుగురినీ మెప్పించాలంటే వినమ్రపూర్వకంగా ప్రసంగించాలి. అప్పుడే మంచి వక్తగా పేరు లభిస్తుంది.

నాయకత్వ లక్షణాల్లోనూ నమ్రతదే ప్రధాన పాత్ర. ఒకసారి సత్యభామ కొన్ని ఫలాలు తెచ్చి శ్రీకృష్ణుడి ముందు ఉంచుతుంది. ‘ఇవి నా తోటలో పండినవి. వీటిని మీరెక్కడా చూసి ఉండరు. ఎంతో రుచిగా ఉంటాయి’ అని గొప్పలు చెబుతుంది.ఆయన ఒక పండు రుచి చూసి నవ్వి ‘ఇవి సారహీనంగా ఉన్నాయి’ అంటాడు.

ఒక గ్రామీణు రాలు దోసిట్లో కొన్ని నేరేడుపళ్లు తెచ్చి ‘స్వామీ! ఇవి మీలాగే శ్యామసుందరాలు. నాకెంతో ఇష్టం. తిని ఎలా ఉన్నాయో చెప్పండి’ అంటుంది. ఆయన వాటిని తిని ఎంతగానో ప్రశంసిస్తాడు.

అణకువ కలిగించే ఫలితం అలా ఉంటుంది. తులాభారం సమయంలో సత్యభామ అంతులేని సంపదతో కృష్ణుణ్ని సరితూచాలని చూస్తుంది.అప్పుడు ఆమె ఆభిజాత్యమే ప్రస్ఫుటమవుతుంది.నిండుప్రేమ గల రుక్మిణి కేవలం తులసి ఆకుతోనే ఆయనను సొంతం చేసుకుందంటే, అది అణకువ ఫలితమే!

భక్తి ప్రకటితమయ్యేది అణకువతోనే. అందుకే సత్యభామ కంటే రుక్మిణి, సాధారణ గ్రామీణురాలు- కన్నయ్య మనసులో చిరస్థాయిగా నిలిచారు.

శ్రీకృష్ణుణ్ని పాండవ పక్షపాతి అంటారు. అందుకు కారణం, ఆయనను వారిలో ఆకర్షించిన లక్షణం పాండవుల వినయ గుణమే.

ఎందరు ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎంత విలువైనవి సంపాదించినా- చివరికి ముక్తిమార్గం చూపేది భగవంతుడే.

వినయంగా ఉంటూ, సదా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ, మానవుణ్ని మాధవుడిగా పరిగణిస్తూ మనుగడ సాగించేవారినే దైవం అక్కున చేర్చుకుంటాడు.

మనసును సుగంధ పుష్పంగా చేసి స్వామి చరణాల వద్ద అలంకరిస్తే, మనిషి అనుకున్నది సాధించడం సులభసాధ్యం అవుతుంది.

జన్మ చరితార్థమవుతుంది. అన్నింటికీ మూలాధారం అతడి అణకువ స్వభావమే తప్ప, మరొకటి కాదు.?