Kids

ఎగతాళికి కాలమే సమాధానం

Telugu Kids Moral Stories 2020 - Mocking Will Come Back With Karma

ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. ఆ కోడిని ఎటూ వెళ్లనివ్వకుండా ఒక గంప దాన్ని ఎప్పుడు మూసి పెట్టబడింది.

బయటకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా గంప దాన్ని వదిలేది కాదు.

ఆ గంపకు పక్కనే ఎదిగిన మొక్కలో పూచిన పువ్వు ఇదంతా గమనించి “ఓ గంపా! ఎందుకు ఆ కోడిని అలా మూసి పెట్టి, దాని స్వేచ్ఛను, ఎదుగుదలను అడ్డుకుంటున్నావ్? పాపం కదా” అంది.

పువ్వు మాటలకు అహంకారంతో నిండిన మనసుతో ఆ గంప “నా గుణం అంతే. నాకు నచ్చిన దాన్ని మోసుకెళ్తాను, నా ఇష్టం వచ్చిన దాన్ని మూసి పెడతాను” అని బదులిచ్చింది.

గంప మాటలు విన్న పువ్వు చిన్న నవ్వు నవ్వి
” అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి అని విర్రవీగకు” అంది పువ్వు.

“హ హ హ అవునా! సరే ఇప్పుడు నిన్ను కూడా మూసి పెడతాను. చూస్తావా? అని ఆ గంప, పువ్వును కూడా తన కింద మూసి పెట్టుకుంది.

అయితే, గంప ఆ పువ్వును బంధించింది కానీ, ఆ పువ్వు వెదజల్లే, పరిమళాన్ని మాత్రం బంధించలేకపోయింది.

ఆ సుమగంధాలని అనుసరిస్తూ అక్కడికి వచ్చిన ఒక పసిపాప ఆ గంపను తీసి, పక్కన పడేసి, ఆ పువ్వును తీసుకెళ్లి దేవుని పాదాల వద్ద వుంచింది.

ఈ కథలోలాగే జీవితంలో ఎదగుతున్న వారిని చూసి ఓర్వలేక తమ కింద ఉంచాలని, తొక్కిపట్టాలని కుటిల పన్నాగాలు పన్నేవారికి, ఏదో ఒక సందర్భంలో పరాభవం తప్పదు.

నేను ఎదగాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ
నేనే ఎదగాలి అని అనుకోవడం అంటే అది మూర్ఖత్వం అవుతుందని ఈ గంప కథలోని నీతి!!

కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది.

ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే, వారికి కాలమే సమాధానం చెప్పి తీరుతుంది.

*కరుగుతున్న క్షణానికి…. జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి….
మిగిలిపోయే జ్ఞాపకమే “మంచితనం”.
అదే మనకు నిజమైన ఆభరణం

సర్వే జనా సుఖినోభవంతు.