ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ బారిన పడిన మహిళలకంటే మగవారు చనిపోయే అవకాశం రెండింతలు ఎక్కువట. వృద్ధులు, స్థూలకాయం కలిగిన వారితోపాటు భిన్న సంస్కృతిగల మైనారిటీలు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇంగ్లండ్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ అధికారులు 1.74 కోట్ల రోగుల రికార్డులను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చింది.
అలాగే కరోనా బారిన పడిన శ్వేతజాతీయులకన్నా నల్లజాతీయులు 1.7 రెట్లు, ఆసియన్లు 1.6 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని కూడా వారి ఎన్హెచ్ఎస్ అధికారుల విశ్లేషణలో తేలింది. అన్నింటికన్నా మరో విశేషమేమిటంటే సిగరెట్టు తాగేవారికంటే తాగని వారిలోనే మరణాల సంఖ్య రెట్టింపు ఉందని ‘ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారు 1.74 కోట్ల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించగా, వారిలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ మధ్య కరోనా బారిన పడి మరణించిన 5,707 మంది కూడా ఉన్నారు.
పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయికనుక సిగరెట్లు తాగేవారు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని వైద్యులు తొలుత భావించారు. సిగరెట్లు తాగే వారందరిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉండక పోవచ్చు. కరోనా నేరుగా ఊపిరితిత్తుల్తోకి వెళుతుందికనుక సిగరెట్ పొగ వేడి వల్ల కరోనా వైరస్ మరణించే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం మానేసిన వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్‌ను చంపే గుణం పొగాకులోనే ఉందని, ఆ విషయాన్ని తాము ల్యాబ్ పరీక్షల ద్వారా గుర్తించామని, బ్రిటీష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) కంపెనీ ఇటీవల ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిస్తే తాము కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బయోలాజికల్ ల్యాబ్‌ను కలిగిన బీఏటీ యాజమాన్యం ప్రకటించింది.
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో సిగరెట్ కంపెనీల సహాయం తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ కారణంగానే లండన్ కేంద్రంగా పలు దేశాల్లో కంపెనీ బ్రాంచీలు కలిగిన ఏబీటీకి అనుమతిచ్చేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఊపిరి తిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, మధుమేహం అదుపులో లేకపోవడం తదితర సమస్యలు కలిగిన వారు, 80 ఏళ్ల పైబడిన వారు కరోనా వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.