తన తండ్రి కమల్ హాసన్ తనను ఎప్పుడూ దండించలేదని, తన మీద కేకలు కూడా వేయలేదని చెప్పుకొచ్చారు నటి శ్రుతిహాసన్. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఫ్యాన్స్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. ‘మీ నాన్న వేసిన అతి పెద్ద శిక్ష ఏంటి’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానమిచ్చారు. ‘నాన్న ఎప్పుడు నా మీద కేకలు వేయలేదు. నన్ను దండించలేదు. ఆయన అలా చేయరు. ప్రతి దానికి ఆయన వద్ద ఓ లాజిక్ ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఒకసారి నేను చేసిన తప్పునకు అనుకుంటా.. ‘చాలా నిరాశ చెందాను’’ అని మాత్రం అన్నారు. అలాగే ఆయన చెన్నైలోని ఇంట్లో క్వారంటైన్‌లో సంతోషంగా ఉన్నారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. లాక్‌డౌన్ పూర్తికాగానే మొదట ఏం చేస్తారని అడగ్గా..‘మొదట పనికే నా ప్రాధాన్యం. పనిని బాగా మిస్ అవుతున్నా. అయితే అది కూడా సురక్షితం అనుకుంటేనే వెళ్తాను’ అని అన్నారామె. అలాగే తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. దాని గురించి మాట్లాడుతూ..‘ఆ సూపర్ హిట్ చిత్రంలో భాగం కావడం నిజంగా అదృష్టం. నాకు సంబంధించిన చాలా విషయాల్లో అది మార్పునకు కారణమైంది’ అని గుర్తుచేసుకున్నారు. సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకున్న ఆమె.. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘క్రాక్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఒక్క దెబ్బ వేయలేదు
Related tags :