Fashion

కడిగితే పోయే రంగుకి…ఊడ్చిపెట్టి ఆర్భాటం!

కడిగితే పోయే రంగుకి...ఊడ్చిపెట్టి ఆర్భాటం! - How a middle class family is shredding themselves in debt with crossing budgets

నేటితరానికి ఈ వ్యాసం ఒక చెంపపెట్టు!

అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!

శ్రీరస్తు!శుభమస్తు!అవిఘ్నమస్తు!

*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,
*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,
*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,
*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,
*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం,
*దావత్ పేరుతో తాగితందనాలాడటం,
*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,
*మధ్యతరగతి మనిషికి అవసరమా?

*ఒకడిని చూసి ఒకడు,
*ఒకడ్నిమించి ఒకడు
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.

*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?
*ఏ విధంగా బలపడుతుంది బంధం?
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,
పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.

*పదిమందితో పట్టెడన్నం తింటే,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే,
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,
కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.

*ముహూర్తం చూసి పారేసే కార్డుకి,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,
*చెమటపడితే కారిపోయే రంగుకీ,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,
ఉన్నదంతా ఊడ్చిపెడితే
పదికాలాలు బతకడానికొచ్చే
కొత్తమనిషికి
తర్వాత పెట్టేది ఏమిటి?

*అప్పు చేసి ఖర్చుచేసే,
వెర్రితనం కాదు పెళ్ళంటే!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే
ఇంగితమైన పని వివాహ మంటే!
*శక్తికి మించి ఎగరటం,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం
ముమ్మాటికీ తప్పు.

కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు. ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు!
?ఎవరో వ్రాసినది అయినా అందరికీ అందించాలనే తపన
హైందవ సంస్కృతి పరిరక్షణ లోపాలుపంచుకందాం.