DailyDose

కేరళ కూడా మద్యం ధరలు పెంచింది-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Kerala Hikes Liquor Prices

* తమ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.మద్యం రకాల్ని బట్టి 10 శాతం నుంచి 35 శాతం వరకు ఈ పెంపు ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.కొద్ది రోజుల క్రితమే మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం కాస్త ఆలస్యంగానే ధరలు పెంచింది.లాక్‌డౌన్‌లో మూతపడ్డ మద్యం షాపులకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఇస్తూనే మద్యం రేట్లను పెంచాయి ఇక్కడి స్థానిక ప్రభుత్వాలు.కరోనా లాక్‌డౌన్ వల్ల ఈ చర్య ప్రభుత్వానికి కాస్త లాభదాయకం అయ్యుండొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇదే నేపధ్యంలో కేరళ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మద్యంపై ధరలను పెంచినట్లు చెప్పుకుంటున్నారు.దీంతో మద్యాన్ని ఎక్కువగా ఇష్టపడే కేరళీయులు మరింత ఎక్కువ ధరకు మద్యాన్ని కొనుక్కోవాల్సి వచ్చింది.

* కరోనా వైరస్ నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.కోవిడ్-19 కట్టడికి కృషి చేస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఆర్టీసీ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 9.85 కోట్ల విరాళాన్ని అందించినట్లు ప్రకటించారు. రూ.9.85 కోట్ల చెక్ ను సీఎం యడ్యూరప్పకు అందించినట్లు కర్ణాటక ఆర్టీసీ ప్రకటించింది.

* గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది.8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులతో పాటు బాధితులకు పరిహారం వంటి అంశాలపై ఆరా తీయనుంది.ఉత్పత్తి, పర్యావరణ, భద్రత రంగాల్లోని నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులను తమ బృందం కలుస్తుందని స్పష్టం చేసింది.అందించాల్సిన సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని వెల్లడించింది.

* పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో నివా సం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందజేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన రవాణా పరిమితుల్ని ఎత్తివేసి, నిల్వ ఉంచిన, శీతలీకరించిన ఆహార పదార్థాల విక్రయాలకు అనుమతివ్వాలని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆహార పదార్థాలు మూలం/మార్గం అని ఎటువంటి ఆధారాలు లేవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చెబుతోంది. ‘కొవిడ్‌-19 వ్యాప్తికి ఫ్రోజెన్‌ ఫుడ్‌, కోల్డ్‌/చిల్డ్‌ ఆహార పదార్థాలు కారణమవుతున్నాయనే అపోహతో చాలా చోట్ల వాటి నిల్వకు, రవాణాకు అనుమతి ఇవ్వడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే ఈ ఆరోపణను నిరూపించే సరైన ఆధారాలు లేని కారణంగా దాన్ని ఒకసారి సమీక్షించాల’ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కోరింది. ఆహార వ్యాపార విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ఆహార పదార్థాలను విక్రయించుకునేలా అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఆహార వ్యాపార నిర్వాహకులకు (ఎఫ్‌బీఓలు) మార్గదర్శకాలు కూడా సంస్థ జారీ చేసింది. అలాగే ఆహార సరఫరా సమయంలో భద్రత, శుభ్రతకు సంబంధించి వారికి ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది.