విదేశాల్లో విద్యనభ్యసించాలని కోరుకుంటున్న 48% పైగా భారతీయ విద్యార్థుల నిర్ణయంపై కొవిడ్-19 ప్రభావం చూపించిందని క్వాక్వారెలి సైమండ్స్ (క్యూఎస్) నివేదిక తెలిపింది. విదేశీ విద్యకు ఖర్చులు పెరగడం, రాబడి తగ్గడం, వైరస్ ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ‘భారతీయ విద్యార్థుల చలన నివేదిక 2020: ఉన్నత విద్య అవకాశాలపై కొవిడ్-19 ప్రభావం’ పేరుతో క్యూఎస్ ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని విశ్వవిద్యాలయాలకు ఈ సంస్థ రేటింగ్ ఇస్తుంటుంది.
‘విదేశాల్లో చదవాలని భావించిన 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కొవిడ్-19 ప్రభావం చూపించింది. ఇప్పటికే పెరిగిన విదేశీ విద్య ఖర్చులకు తోడు రాబడి తగ్గడం, కొవిడ్-19 ప్రభావంతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం విద్యార్థుల్లో మార్పుకు కారణంగా నిలిచింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథెమ్యాటిక్స్ (STEM- స్టెమ్) ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఉన్నప్పటి నాన్ స్టెమ్ విభాగాలకు డిమాండ్ తగ్గింది. దీంతో వారు నిర్ణయాలను మార్చుకున్నారు’ అని నివేదిక తెలిపింది.
ఉన్నత విద్యా సంస్థలు ఈ-లెర్నింగ్ పద్ధతులకు అలవాటు పడతాయని నివేదిక అంచనా వేసింది. అయితే మరిన్ని మార్పులు రావడానికి మాత్రం కొంత సమయం పడుతుందని వెల్లడించింది. ప్రయాణాలపై వైరస్ ప్రభావం ఉండటంతో భోదనా పద్ధతులు మార్పు వస్తాయని తెలిపింది.