ఒకప్పుడు పద్దెనిమిది రకాల పంటలు పండించేవారు. వాటివల్ల పిల్లలకు పోషక విలువలు దొరికేవి. దేశవాళీ బియ్యాన్ని మొలకెత్తించి, వేయించి, పొడిచేసి ఆవుపాలలో బెల్లం వేసి పిల్లలకు పెడితే అంతకు మించిన పౌష్టికాహారం ఉండదు. వీటితో మరమరాలు, అటుకులు చేసుకుని తినడం వల్ల కూడా ఫైబర్ అందుతుంది. ఈ బియ్యం రవ్వకు పెసరపప్పు కలిపి తినిపిస్తే చాలా మంచిది. రైతులు ఈ విద్యలన్నీ నేర్చుకోవాలి. పంటలు పండించడమే కాదు, వాటికి అదనపు పోషక విలువలు జోడించి వాణిజ్య పరంగా కూడా లాభాలను గడించవచ్చు. రసాయనాలతో ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రసాయనాలు వాడకుండా కేవలం 10 శాతం నీరు, 10 శాతం విద్యుత్తు మాత్రమే ఉపయోగించి బహురూపి 35 బస్తాలు, నవ్వార 25 బస్తాలు (బస్తాకు 72 కిలోలు) పండించవచ్చు.
మొలకలొచ్చే బియ్యం రకం ఇదే. చివరికి నూకల నుంచి కూడా మొలకలొస్తాయంటే ఎంత ప్రత్యేకమైందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ బియ్యంలో 0.5 శాతం ఫైబర్ ఉంటే, నవ్వారాలో 14.5 శాతం ఉంటుంది. మలబద్దకం, మోకాళ్ల నొప్పులు, షుగర్, స్థూలకాయం, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని 45 రోజుల్లో నివారిస్తుంది. కాబట్టే, ‘నివారణ్’ అన్న పేరొచ్చింది.
పెళ్లి సంబంధాలు చూడటానికి ముందు అబ్బాయికి ఈ బియ్యంతో భోజనం పెట్టి బలంగా తయారు చేస్తారు. పెండ్లి కూతురి తండ్రి … అబ్బాయికి బలపరీక్ష పెడతాడు. ఒక బరువైన రాయిని పైకి ఎత్తి, ముందుకు కాకుండా వెనుకవైపునకి దూరంగా విసరాలి. ఎవరెక్కువ దూరం విసిరితే వాళ్లే వరపరీక్షలో గెలుస్తారు. అతనికే పిల్లనిచ్చి పెండ్లి చేస్తారు. పరీక్షలో నెగ్గడం కోసమే వరుడికి ఈ బియ్యాన్ని వండి పెట్టేవాళ్లు. ఇకపోతే పెళ్లి కూతురి దగ్గరికి పంపేటప్పుడు, పండగలప్పుడు అల్లుడికి ఈ బియ్యంతోనే ప్రత్యేకంగా వండి పెడతారు. అందుకే దీనికి ‘అల్లుడు బియ్యం’ అన్న పేరు వచ్చింది. మగవాళ్లలో పునరుత్పత్తి సమస్యలకు ఈ విత్తనం మంచి పరిష్కారం. చూపిస్తుంది. ఈ అన్నం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.