“తానా” భవనం అమరావతిలో కాదు. ముందు అమెరికాలో కట్టండి-TNI ప్రత్యేకం

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)ను ఏర్పాటు చేసిన అప్పటి ప్రవాసాంధ్ర ప్రముఖులు తమ సేవల ద్వారా తానాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ప్రపంచంలోనే “తానా” అగ్రశ్రేణి ప్రవాస తెలుగు సంస్థగా నేడు రూపుదిద్దుకోవటం వెనుక నాటి ప్రవాసాంధ్ర నేతల కృషి అద్భుతమైనది, అనుసరణీయమైనది. నాడు కేవలం ప్రవాసాంధ్రులకు సేవలు అందించడం కోసం అమెరికాలో ఉన్న తెలుగువారి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, అమెరికాలోని వివిధ రంగాల్లో మన తెలుగువారు అగ్రశ్రేణిలో ఉండే విధంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడం నాటి తానా నేతల ముఖ్యోద్దేశం. మొత్తం మీద తానాను స్థాపించిన వ్యక్తుల కృషి ఫలించి తానా తిరుగులేని ప్రవాస తెలుగు సంఘంగా ఉన్నత స్థానానికి ఎదిగింది. నేటి తానా నాయకత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నేటి తానా నేతల్లో కొందరు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం తానాను వాడుకుంటున్నారనే అభిప్రాయం అటు ప్రవాసాంధ్రుల్లో, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో వ్యక్తమవుతోంది.

*** “తానా” వ్యవస్థాపకులు అందరికీ ఆదర్శప్రాయం
“తానా”ను ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన డా.గుత్తికొండ రవీంద్రనాథ్, డా.కాకర్ల సుబ్బారావులు ఇప్పటికీ తెలుగు జాతికి సేవలు అందిస్తూనే ఉన్నారు. గుత్తికొండ రవీంద్రనాథ్ తన స్వగ్రామం గుంటూరు జిల్లా మోపర్రులో ముప్పై ఏళ్ల క్రితమే తన సొంత నిధులతో గ్రామం అంతా సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ఏనాడూ ఆయన ఆడంబరాలకు పోలేదు. ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు గ్రామాభివృద్దికి, ఇతర సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టినప్పటికీ ఏనాడు ఆయన బయటికి చెప్పుకోలేదు. డా.కాకర్ల సుబ్బారావు మంచి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాకర్ల సేవలను గుర్తించి ఆయనను రాష్ట్రానికి రావలసిందిగా స్వయంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లో నిమ్స్ డైరెక్టర్ పదవిని అప్పగించారు. డా.సుబ్బారావు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన తానా అధ్యక్షులు కూడా తానా ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. డా.గొర్రెపాటి నవనీతకృష్ణ అమెరికాలో ఉన్న నిరుపేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్యాక్‌ప్యాక్ పథకం ఇప్పటికీ అప్రతిహతంగా అమలవుతోంది. డా.తోటకూర ప్రసాద్ హయాంలో చాలా మంది తెలుగు కళాకారులను ప్రవాసాంధ్రులకు పరిచయం చేశారు. ఆయన హయాంలో తెలుగు భాషా, సాంస్కృతిక కళాపోషణ బాగా జరిగింది. డల్లాస్‌లో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన గాంధీ విగ్రహం ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. నన్నపనేని మోహన్ ప్రవేశపెట్టిన “తానా టీం స్క్వేర్” మంచి ఫలితాల్ని ఇచ్చింది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

*** అమెరికాలో “తానా”కు శాశ్వత భవనం ఏదీ?
40సంవత్సరాల క్రితం రెండంకెల సంఖ్యతో ఏర్పడ్డ తానాలో నేడు 20వేల మంది వరకూ సభ్యులు ఉన్నారు. కానీ తానాకు శాశ్వతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఎవరూ శ్రద్ధ చూపలేకపోయారు. రెండేళ్లకొకసారి మిలియన్ల కొద్దీ ఖర్చు చేసి సంబరాలు జరుపుకోవడం పైనే పెడుతోన్న శ్రద్ద భవననిర్మాణంపై పెట్టలేకపోవడం విచారకరం. వాస్తవానికి “తానా” నూతన భవనం నిర్మించడం ఇప్పుడున్న నేతలకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. “తానా” తరఫున అమెరికాలో ఒక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నాటి నేతల కోరిక ఇప్పటి వరకు నెరవేరనేలేదు.

*** “సిలికానాంధ్ర”కు ఉన్న విలువ “తానా”కు లేదాయే!?
గత డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలు నిర్వహించడానికి “తానా” నేతలు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటానికి వెళ్లిన “తానా” నేతలకు 5గంటల సేపు వేచి ఉన్న తరువాత చంద్రబాబు దర్శన భాగ్యం లభించింది. అదే సమయంలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మూడురోజుల పాటు విజయవాడలో నిర్వహించిన ప్రపంచ కూచిపూడి ఉత్సవాలకు ముఖ్యమంత్రి మొదటి రోజున, మూడో రోజున స్వయంగా హాజరై నాలుగేసి గంటలపాటు మనవడితో సహా అక్కడ గడిపారు. తరచుగా ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేసే “తానా” నేతలు గత డిసెంబరు నెలలో రాష్ట్రంలో మొక్కుబడిగా నిర్వహించిన ఒక్క కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకురాలేకపోయారు.

*** అమరావతిలో “తానా” భవనం అవసరమా?
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం తానా నేతలు ముఖ్యమంత్రిని కలవడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం తరచుగా కొందరు నేతలు ముఖ్యమంత్రిని కలుస్తూ ఉండటం మాత్రం అభ్యంతరకరమే! అమెరికాలో “తానా”కు భవనం నిర్మించకుండా ముఖ్యమంత్రి మెప్పు కోసం అమరావతిలో “తానా” భవనం నిర్మిస్తామని స్థలం కేటాయించాలని చంద్రబాబును కోరటం పట్ల ప్రవాస తెలుగు ప్రజల్లో తానా నాయకత్వం పట్ల చిన్న చూపు ఏర్పడుతోంది. డెట్రాయిట్ వెంకన్న ఆలయంలో రెండున్నర లక్షల డాలర్లతో ఏర్పాటు చేసింది తానా భవనం కాదు. ఆలయంలో ఓ మూల చిన్నగది మాత్రమే. దీన్ని 2015 “తానా” సభలకు హాజరయిన అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉప-రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభింపజేశారు.

*** తానా నాయకత్వం ఆదర్శంగా ఉండాలి
ప్రపంచంలోనే ప్రముఖ తెలుగు సంస్థగా వెలుగొందుతున్న “తానా”కు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావటాన్ని చాలా మంది ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ఎన్నికైన నేతల తీరు ఏమాత్రం బాగోలేదు. ఇటీవల సెయింట్‌లూయిస్‌లో జరిగిన “తానా” మహాసభలకు సంస్థలో కీలక బాధ్యత కలిగి, ప్రముఖ పాత్ర పోషించే ప్రధాన కార్యదర్శి, కోశాధికారి గైర్హాజరు కావటం నాయకత్వ బలహీనతలకు నిదర్శనం. చాలామంది పూర్వ అధ్యక్షులు కూడా ఈ సభలకు గైర్హజరై ప్రస్తుతం నాయకత్వం పట్ల తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ “తానా” నాయకత్వం ఇక నుండి సేవా కార్యక్రమాలపైనే పెద్ద ఎత్తున దృష్టిపెట్టాలి. అమెరికాలో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులకు అండగా నిలవాలి. “తానా”కు మంచి భవనాన్ని ఒక పెద్ద నగరంలో ఏర్పాటు చేసే విషయంపై కార్యోన్ముఖ దృష్టి పెట్టాలి. “సిలికానాంధ్ర” వంటి చిన్న సంస్థ భారీస్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ వద్దకు వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటి “తానా” నాయకత్వం కూడా ముఖ్యమంత్రి మీవద్దకు వచ్చే విధంగా పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరించాలి. ప్రవాసాంధ్రులే మిమ్మలను సత్కరించే విధంగా, గుర్తుండే విధంగా కార్యక్రమాలు నిర్వహించండి. చాలా మంది దాతలు మీ వెంట ఉన్నారు. దానిని మర్చిపోకండి. “తానా” అభిమానిగా నేను చేసే ఈ చిన్న సూచనలను దృష్టిలో పెట్టుకోండి. —కిలారు ముద్దుకృష్ణ.

More News

2 thoughts on ““తానా” భవనం అమరావతిలో కాదు. ముందు అమెరికాలో కట్టండి-TNI ప్రత్యేకం

  1. innaiah Narisetti

    తన పెర్మనెంట్ బిల్డింగ్ నీడ్ వస్ వెల్ ప్రెసెంతెద్ బై కిలారు ముద్దుకృష్ణ. ఐ సపోర్ట్ ఇట్.
    tana permanent building is a must and it should be completed soon as promised by the office bearers.

  2. Vnvksastry

    తానా, తందానా వాళ్ళను తప్పిస్తే, పూర్వ వైభవం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com