నేలమ్మ నేలమ్మ… అంటూ మట్టి పరిమళాల్ని వెదజల్లిన కలం అది. ఒకటే జననం ఒకటే మరణం… అంటూ పోరాట స్ఫూర్తినీ రగిలించింది. నువు యాడికెళ్తే ఆడికొస్త సువర్ణా… అంటూ కొంటె బాణాల్నీ విసురుతుంది. నీలి రంగు చీరలోన సందమామ నీర జాణ…అంటూ మెలోడీ గీతాలతో మది మదినీ దోస్తుంది. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే…’ అంటూ ఎవ్వర్నయినా ‘ఫిదా’ చేసిన ఆ కలం సుద్దాల అశోక్‌తేజది. శ్రీశ్రీ, వేటూరి తర్వాత ‘నేను సైతం…’ అంటూ తెలుగు పాట కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన ఘనత సుద్దాలది. ‘ఠాగూర్’ చిత్రం కోసం సుద్దాల రాసిన నేను సైతం… పాటకి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సుద్దాల. 24 యేళ్ల సినీ ప్రయాణంలో 1200పై చిలుకు సినిమాల్లో 2400పైగా పాటల్ని రచించిన ఘనత ఆయనది. గరం గరం పోరి నా గజ్జల సవ్వారి… అంటూ పాటందుకొన్న సుద్దాల కలం… ఎప్పటికప్పుడు పదును పోసుకొంటూ వచ్చింది. ఇప్పటికీ యువతరాన్ని ఉర్రూతలూగించేలా పాటలు రాస్తున్నారు సుద్దాల. విప్లవ భావాలైనా, జానపదమైనా, శృంగార రసాన్ని ఒలికించాలాన్నా… సెంటిమెంట్ గీతమైనా… ఆయన కలం నుంచి జాలువారిందంటే చాలు.. అది కొన్నాళ్లపాటు శ్రోతల మదిలో నిలిచిపోవల్సిందే. నటుడు ఉత్తేజ్ మేనమామ అయిన సుద్దాల అశోక్‌తేజ పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడు. తన మేనల్లుడు, నటుడు ఉత్తేజ్ ప్రోద్భలంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తనికెళ్ల భరణి ప్రమేయంతో తన తొలిపాటని ‘నమస్తే అన్న’లో రాశారు. ఆ తరువాత నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కృష్ణవంశీ, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలతోపాటు… శ్రీహరి కథానాయకుడిగా నటించిన పలు చిత్రాల్లో వరుసగా పాటలు రాస్తూ శ్రోతల్ని అలరిస్తూ వచ్చారు. తండ్రి, స్వాతంత్య్ర సమర యోధుడైన సుద్దాల హనుమంతు, డా.సి.నారాయణరెడ్డి రచించిన పాటల స్ఫూర్తితో పాఠశాల రోజుల నుంచే కలం కదిలిస్తూ వచ్చిన సుద్దాల అశోక్‌తేజ… ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాకి సి.నారాయణరెడ్డితో కలిసి పాటలు రాశారు. అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన ఘట్టం అని చెబుతుంటారు సుద్దాల. సినిమా ఎలాంటి పాట కోరుకొంటే అలాంటి పాట రాసేలా తనని తాను మలచుకొన్నా అంటారాయన. కొంతకాలం కిందట ‘ఫిదా’ కోసం రాసిన వచ్చిండే పాటతో పాటు… ‘బేవర్స్’ కోసం తల్లీ తల్లీ అంటూ రాసిన గీతాలు యువతరంతో పాటు.. పెద్దవాళ్లని కూడా ఉర్రూతలూగించాయి. ఈ రోజు సుద్దాల పుట్టినరోజు.
ఈరోజు సుద్దాల పుట్టినరోజు-TNI ప్రత్యేకం
Related tags :