Sports

ఛెత్రిపై జాతి వివక్ష వ్యాఖ్యలు

Indian Soccer Captain Chetri Faces Racist Remarks

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి సామాజిక మాధ్యమంలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్‌ అతణ్ని ఉద్దేశించి.. ‘‘ఎవరీ నేపాలీ’’ అని ప్రశ్నించాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అద్భుతంగా రాణిస్తూ.. ఎనిమిదేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్న గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడడమేంటంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను మూసేసి వెళ్లిపోయాడు. ఇక ఈ చాట్‌ కార్యక్రమంలో ఛెత్రి అడిగిన అనేక ప్రశ్నలకు విరాట్‌ సమాధానాలిచ్చాడు. జూనియర్‌ స్థాయిలో తన తండ్రి లంచం ఇవ్వనందుకు ఓసారి తనకు జట్టులో చోటివ్వలేదని కోహ్లి వెల్లడించాడు. సచిన్‌ ఇన్నింగ్స్‌ల్లో షార్జా శతకం (144) తనకెంతో ఇష్టమన్న విరాట్‌.. అలాంటి ఇన్నింగ్స్‌ తానూ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను అభిమానించడానికి అతడి దూకుడే కారణమని కోహ్లి అన్నాడు.