Agriculture

ఉష్ణోగ్రతలు 44 దాటుతాయి

Weather Dept Warnings That Temperatures Will Be Above 44 In AP

విశ్వరూపం ప్రదర్శిస్తున్న భానుడు
రెంటచింతలలో నిప్పుల వర్షం
24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు
ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని తెలిపింది. మరోవైపు, గుంటూరు జిల్లా రెంట చింతలను గత మూడు రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సూరీడు.. నిన్న ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.