* ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు జీవో రద్దు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ని రద్దు చేసిన హైకోర్టు. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరఫున వాదనలు కోర్ట్ కు వినిపించిన న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని హైకోర్టు అభ్యంతరం.
* హైకోర్టు తీర్పుపట్ల డాక్టర్ సుధాకర్ తల్లి హర్షం వ్యక్తం చేశారు. కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడం శుభపరిణామం అన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.
* ఐపీఎస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం. సస్పెన్షన్‌ను సమర్థిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది.
* ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కొల్లి నాగేశ్వరరావు ఆకాల మరణం. భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొల్లి సేవలు, ఉద్యమ పోరాటం నేటికీ చిరస్మరణీయం. రైతాంగ ఉద్యమాలకు వెన్నెముక. కార్యకర్తలు, నాయకులకు ప్రేరణ కొల్లి. శుక్రవారం ఉదయం విజయవాడలో అంత్యక్రియలు.
* పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలు అండగా నిలుస్తాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీటి ఏర్పాటుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. నాణ్యమైన ప్రాథమిక వైద్యం కోసమే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్, యాదగిరి నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
* రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలు ఎలాంటి కోతలూ లేకుండా పూర్తిగా చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో వేతనాల్లో విధించిన కోతను నిలిపివేసి ఈ నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించాలని ఐకాస విజ్ఞప్తి చేసింది. ఈ నెల మొదటి వారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఉద్యోగుల ఐకాస ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగైన నేపథ్యంలో పూర్తి వేతనాలు చెల్లించాలని ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. రెండు నెలలుగా ఉద్యోగులు సగం జీతాలతోనే సరిపెట్టుకుంటున్నారని, ఈనెల పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నట్లు వివరించింది.
* కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల దృష్టికి చేరటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదవేగి మండలానికి చెందిన దంపతుల కుమార్తెకు 14 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూలేని సమయంలో కూతురిని బెదిరించి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి వికృత చేష్టలు భరించలేక ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వచ్చిఏలూరు వైపు వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులో ఓ గదిలో ఉంచి ఆ మరుసటి రోజు తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పుడే అతను ఆమె తల్లికి అఘాయిత్యం గురించి చెప్పాడు. అయితే తనను గదిలో ఉంచిన వ్యక్తి కూడా బలాత్కారం చేయబోయాడని బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ పైడేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుస్టేషన్‌లో తనపై కేసు నమోదైందని తెలుసుకున్న తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. మే నెల వరకు గతంలో చేసిన కేటాయింపులు పూర్తవడంతో తాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. దీంతో ఇవాళ బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
* ప్రస్తుతం భారతదేశం ఐటీ, టెలికాం రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తుందంటే దానికి కారణం భారత ప్రధానిగా రాజీవ్‌గాంధీ నాడు చూపిన చొరవేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్‌ఠాక్రే అన్నారు. గురువారం భారతమాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 29వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశప్రజలంతా ఐటీ, టెలికాం రంగాల్లో వచ్చిన అభివృద్ధి విప్లవంతో మంచి ఫలాలను పొందుతున్నారని, ఆ విప్లవానికి పునాది వేసింది మాత్రం మాజీప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీనేని స్పష్టం చేశారు. నాడు ఆయా రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేడు సజీవసాక్ష్యాలుగా దర్శనిమిస్తున్నాయన్నారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమన్నారు. ఈ క్రమంలోనే దేశమంతా కలిసికట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అదే మనమంతా రాజీవ్‌గాంధీకి ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. 1991 సంవత్సరం తమిళనాడులోని పెరంబదూరుకు ఎన్నికల ప్రచారనిమిత్తం వెళ్లిన నాటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు బలితీసుకున్న సంగతి తెలిసిందే.
* విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత పోలీసులపై కేసు నమోదుచేసి సీబీఐ విచారణచేపట్టాలని ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం నిర్దేశించింది.