భారత, పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో.. మిడతలు పెను ప్రమాదంగా మారాయి.
ఆ ప్రాంతాల్లో పండుతున్న పంటల్ని మిడతలు పిప్పి పీల్చేస్తున్నాయి.
దీంతో దక్షిణ ఆసియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు వస్తున్నాయి.
ఇప్పటికే కోవిడ్19 వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది.
ఇప్పుడు డెజర్ట్ మిడతల దాడితో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పటికే పాకిస్థాన్‌లో పంటల్ని మిడతలు మింగేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ దేశానికి సహకరించేందుకు భారత్ స్నేహహస్తం చాచింది.
ఆఫ్రో-ఏషియా ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఈ మిడతలను నివారించేందుకు పాక్, ఇరాన్‌తో భారత్ పనిచేయనున్నది.
మిడతల నియంత్రణ కోసం బోర్డర్ ప్రదేశాల్లో మాలాథియాన్ క్రిమిసంహారకాన్ని పాకిస్థాన్‌కు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నది.
కేవలం కొన్ని గంటల్లోనే వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మిడతలు పంటల్ని నాశనం చేయగలవు.
ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న పంటలో సుమారు 40 మిలియన్ల మిడితలు దాడి చేసే అవకాశం ఉన్నది.
35వేల మంది తినే ఆహారాన్ని కేవలం ఒక్క రోజులోనే మిడతలు మాయం చేస్తాయని అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ మీదుగా మిడతలు ఇప్పటికే రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.