Business

ఎల్జీ పాలీమర్స్ డైరక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం

AP High Court Orders To Seize LG Polymers Director's Passports

ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్‌ స్వాధీనపరచాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. లాక్‌డౌన్‌ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్‌ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాలను సీజ్‌ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది. గ్యాస్‌ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలని తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్‌ గ్యాస్‌ను తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. విద్యాసంస్థల, హాస్పిటల్స్‌, జనావాసాలు ఉన్నచోట… అంత ప్రమాదకరమైన గ్యాస్‌ను ఎలా స్టోర్‌ చేశారని ప్రశ్నించింది. గ్యాస్‌ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, స్టైరిన్‌ గ్యాస్‌ తరలించేందుకు అనుమతించడంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం నాటి విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన విషయంలో… ఇప్పటి వరకు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు సరైనవేనని రుజువైందని న్యాయనిపుణులు అంటున్నారు