కాఫీ ఎలా చేస్తారు? కాఫీ మొక్కకి కాసే గింజలతోనే కదా… గ్రీన్ టీ ఎలా చేస్తారు? తేయాకు ఆకులతోనే కదా… కానీ అరకులో మాత్రం కాఫీ ఆకులతోనూ గ్రీన్ టీ తయారు చేస్తున్నారు. పైగా ఇది తేయాకుతో చేసే గ్రీన్ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదనీ మధుమేహులకి మరీ మంచిదనీ అంటున్నారు.
**కాఫీ ఆకులతో గ్రీన్ టీనా…ఇదేం తికమక అనుకోవద్దు. మీరు చదివేది నిజమే. విదేశాల్లో కొన్నిచోట్ల ఈ టీని ఇప్పటికే తాగుతున్నారు. మన దగ్గర మాత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. నేచురల్ ఫార్మసీ ఇండియా సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటగా అరకు కాఫీ ఆకులతో గ్రీన్ టీని రూపొందించారు అమెరికా నివాసి మాదల రామన్.
**పచ్చకోక చుట్టుకున్న తూర్పుకనుమలూ వాటి మధ్యలోని లోతైన లోయలూ ఆ లోయల్లో విరిసిన అవిసె పూలూ… అరకు అనగానే ఠక్కున స్ఫురించే అందాలు. వీటితోబాటు ఎత్తైన చెట్లూ వాటి మధ్యలో గుబురుగా పెరిగిన కాఫీ తోటలూ వాటికి పక్కనే వెలసిన కాఫీ అవుట్‌లెట్లూ తప్పక గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. భారీ మాల్స్‌తోబాటు తనదైన బ్రాండ్‌తో వందలకొద్దీ కియోస్క్‌లు తెరిచే స్థాయికీ చేరుకుంది. అంత రుచికరమైన కాఫీని అందిస్తోన్న ఆ మొక్కల ఆకులతో టీ రుచుల్నీ అందించవచ్చని తెలుసుకుని దానికి తానే స్వయంగా శ్రీకారం చుట్టాడు మాదల రామన్. ఓసారి సిలికాన్ వ్యాలీలోని ఇథియోపియన్ రెస్టరెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడ కాఫీ ఆకులతో చేసిన గ్రీన్ టీ రుచి నచ్చడంతో దాని గురించి ఆరా తీశారట. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజలకన్నా ఆకుల్నే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచీ వాడుతున్నారనీ, దీన్ని వాళ్లు ‘కుటి’ అంటారనీ, అందువల్లే అక్కడ డయాబెటిస్ బాధితులు తక్కువనీ తెలుసుకున్న రామన్, అరకులో పండే కాఫీ ఆకులతోనూ అలా చేయవచ్చన్న ఆలోచనతో ఇథియోపియాకి వెళ్లి మరీ దానిమీద రెండున్నరేళ్లపాటు పరిశోధన చేశారు. ఆపై స్థానిక రైతులతో మాట్లాడి తయారీని ప్రారంభించారు. అదే ఇప్పుడు స్థానికులకు ఉపాధితో బాటు రైతులకి లాభాలనీ తెచ్చిపెడుతోంది. సాధారణంగా కాఫీ గింజలు గట్టిపడేందుకు ఏడాదికి రెండుసార్లు కొత్తగా కొమ్మల్ని కత్తిరిస్తుంటారు. అయితే ఒకప్పుడు ఈ పనిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కత్తిరించిన ఆకులకూ ఆదాయం రావడంతో గిరిజన రైతులు విధిగా వాటిని తుంచుతున్నారు. ఆపై వాటిని ఎండబెట్టి విక్రయిస్తున్నారు.
***ఎలా మంచిది?
మార్కెట్లోని గ్రీన్ టీలతో పోలిస్తే ఈ కాఫీ ఆకులతో చేసే కుటి, అరకు టీల్లో కెఫీన్ 45 శాతం తక్కువగానూ, యాంటీ ఆక్సిడెంట్లు 18 శాతం ఎక్కువగానూ ఉంటా యంటున్నారు రామన్. ఈ టీల్లో 70 శాతం ఎండిన కాఫీ ఆకులూ 12 శాతం అనాసపువ్వూ 10 శాతం నిమ్మగడ్డీ ఎనిమిది శాతం సోంపు వంటి సుగంధద్రవ్యాలూ ఔషధాలూ కలిపి తయారుచేయడంతో ఇవి ఎంతో రుచిగానూ ఉంటాయట. కేవలం ఇవే కాకుండా ఉసిరి, దాల్చినచెక్క, మెంతులు, వాము, ఛమేలీ, లావెండర్, నల్లజీలకర్ర, మునగాకు… వంటి పలు ఔషధ దినుసుల్ని కలిపి ఎర్లీ మార్నింగ్, రోజెల్లా, స్ట్రెస్ బస్టర్, గుడ్‌నైట్… ఇలా మరో నాలుగు రకాల ఔషద టీలను ఎలాంటి కృత్రిమ ఫ్లేవర్లూ లేకుండా చేస్తున్నారు. గ్రీన్ టీలానే పాలూ పంచదార లేకుండా తాగే ఈ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కాఫీ ఆకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లతోబాటు మ్యాంగిఫెరన్ అనే పదార్థం ఉంటుందనీ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ చెబుతున్నారు. కొలెస్ట్రాల్, డయాబెటిస్ తగ్గడానికీ మెదడు పనితీరుకీ ఈ మ్యాంగిఫెరన్ దోహదపడుతుందట. గిరిజన సహకార సంస్థలతోబాటు చాయ్‌గురూ ఇతర ఆన్‌లైన్ సంస్థల ద్వారా విక్రయిస్తోన్న ఈ కాఫీ తేనీరు- చాయ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాఫీ ఆకులతో తేనీరు
Related tags :