నటి జ్యోతిక కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ మార్క్ ఏర్పడిపోయింది. జ్యోతిక నటించిన తాజా సినిమా ‘పోన్ మగల్ వందల్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య సినిమాను నిర్మించారు. జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్, పాండియరాజన్, ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో జ్యోతిక న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించడంతో జ్యోతిక మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
‘41 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను ఓ హీరోలా ఫీల్ అవుతున్నా. దీనికి కారణం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించడమే. ఈ మధ్యంతా ఇలాంటి చిత్రాల్నే ఎంచుకుంటున్నా. ఇలాంటి చిత్రాల వల్లే రేవతి, భాగ్యరాజ్, ప్రతాప్ వంటి గొప్ప నటులతో కలిసి తెరను పంచుకునే అవకాశం వచ్చింది. ఈ తరహా చిత్రాల్లో మొత్తం కథ నాపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా భుజాలపై బరువు మోస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే షూటింగ్ ఆరంభం కావడానికి రెండు నెలల ముందే స్క్రిప్టు పుస్తకం ఇవ్వమని దర్శకుడ్ని అడిగి తీసుకుంటున్నా. దాని ద్వారా ముందుగానే పాత్రకు నన్ను నేను సిద్ధంగా చేసుకుంటున్నా. కేవలం కెమెరా ముందు అందంగా కనిపిస్తే సరిపోదు. ఇలాంటి సినిమాలకు శ్రమ అవసరం’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జ్యోతిక-కార్తి కలిసి నటించిన ‘తంబి’ సినిమా విడుదలైంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2015లో జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు.