ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ గుడి పూజారి వ్యక్తిని బలిచ్చాడు. గుడిఆవరణలోనే అతడిని హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకుంది.
కటక్ జిల్లా నర్సింగాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందహుడా గ్రామంలోని ఓ గుడిలో సన్సారీ ఓజా (72) పూజారిగా ఉన్నాడు. గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ ప్రధాన్ (52)ను బుధవారం రాత్రి పదునైన గొడ్డలితో తల నరికి హతమార్చాడు. గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నేరం తానే చేసినట్లు అంగీకరించాడు.
కరోనా వైరస్ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని పోలీసుల విచారణలో ఓజా చెప్పాడు. గ్రామస్థులు మాత్రం హత్యకు గురైన వ్యక్తికి, పూజారికి మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. ఘటన సమయంలో నిందితుడు ఫూటుగా తాగున్నాడని, ఉదయం తప్పు తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెబుతున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని వెల్లడించారు. నిందితుడు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.