కరోనా వ్యాక్సిన్ సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుందని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అంచనా వేశారు. కాబట్టి రాబోయే కొన్నేళ్ల పాటు ఈ మహమ్మారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఆరోగ్య సంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ఆమె శనివారం జరిగిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. ‘మొత్తం దేశానికి అందుబాటులోకి వచ్చేలా ఒక సురక్షితమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి చాలా కాలం పాటు వేచిచూడాల్సి వస్తుందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్ అభివృద్ధి అనేది చాలా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. అత్యంత తక్కువ సమయం అనుకున్నా అందుకు నాలుగేళ్లు పట్టవచ్చ’ని మజుందార్ షా పేర్కొన్నారు. ‘ఒక ఏడాదిలోపు దానిని అభివృద్ధి చేయడం అనేది అసాధ్యమైన పనే. వ్యాక్సిన్ అభివృద్ధిలో భద్రత, సామర్థ్యం ఉండాలంటే.. పెద్ద స్థాయిలో పలు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్ వచ్చేంత వరకు కొన్నేళ్ల పాటు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆరోగ్యసంరక్షణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ కరోనా మనకు నొక్కిచెబుతోంద’ని ఆమె వివరించారు. ‘ఆరోగ్య సంరక్షణ అనేది మూలధనం అవసరమయ్యే రంగం. నైపుణ్యంతో కూడిన, ఉద్యోగాలను ఇచ్చే రంగం కూడా. ఇపుడు ఆరోగ్య మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అవకాశం కలిగింది. అదే భారత్‌ను, ప్రపంచాన్ని కాపాడుతుంద’ని అన్నారు. అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘వైద్య వసతులను మెరుగుపరచుకోవాలని ఈ మహమ్మారి మనకు చెబుతోంది. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెరగాలి. కేవలం మౌలిక వసతుల్లోనే కాకుండా.. నైపుణ్యాభివృద్ధిలోనూ పెట్టుబడులను పెంచాల’ని అభిప్రాయపడ్డారు.
బయోకాన్ ఎండీ అంచనా ప్రకారం వ్యాక్సిన్‌కు నాలుగేళ్లు
Related tags :