మదర్ ఇండియా సినిమా పేరు వింటే నర్గిస్ పేరు గుర్తురాక మానదు. ప్రముఖ సినిమా పత్రిక ఫిలిం ఇండియా సంపాదకుడు బాబురావు పటేల్ ఎవరినైనా పొగిడారంటే అది నర్గిస్ ని మాత్రమే. ఎందుకంటే బాబురావు పటేల్ తన కలం బలంతో హిందీ చిత్రాల విజయాలను శాసించారు. 1957లో ఆమె నటించిన మదర్ ఇండియా సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం వెనుక నర్గీస్ అద్భుత నటన వుందనేది నిర్వివాదాంశం. మదర్ ఇండియా షూటింగులో అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంలో సునీల్ దత్ తెగించి మంటల్లో దూకి ఆమెను రక్షించడం నర్గీస్ ను కలచివేసింది. తనకన్నా వయసులో పినవాడైన సునీల్ దత్ ను వివాహమాడింది. అప్పట్లో మదర్ ఇండియా సినిమా సూపర్ హిట్ గా ఆడుతుండేది. అటువంటి స్టార్డంను విడిచి గృహిణిగా స్థిరపడేందుకే నర్గీస్ మొగ్గు చూపింది. ఇది ఆమె వ్యక్తిత్వానికి గీటురాయి. 1940-60 దశకాల మధ్య కాలంలో నర్గీస్ ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు చూరగొంది. భారత రాజ్యసభ సభ్యురాలిగా, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, తొలి ఫిలింఫేర్ బహుమతి అందుకున్న నటిగా నర్గీస్ నటప్రస్థానం అద్వితీయం. జూన్ 1 న నర్గీస్ జయంతి
నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935 లో తలాషె హక్ తన ఆరవయేట నటించింది. ఈ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్, ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో నటించింది. ఈమె విజయవంతమైన హిందీ-ఉర్దూ సినిమాలు 1940 – 1950 ల మధ్య విడుదలైన బర్సాత్, అందాజ్, ఆవారా, దీదార్, శ్రీ 420, చోరీ చోరీ. ఈమె చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.
తన ప్రసిద్ధిగాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా (1957). ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతి తెచ్చి పెట్టింది.