ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది.
అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల బృందాన్ని జీ7 అంటారు. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలు. ఎవరైతే ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తారో వారు తమకు సన్నిహిత ఇతర రెండు దేశాలను ఆహ్వానించొచ్చు. గత సమావేశాలకు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు.
కరోనా వైరస్ కారణంగా ఈసారి జీ7 సదస్సును సెప్టెంబర్ వరకు ట్రంప్ వాయిదా వేశారు. అయితే కాలం చెల్లిన ఈ బృందాన్ని జీ10 లేదా జీ11గా మారిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. భారత్, రష్యా సహా మరో రెండు దేశాలతో విస్తరించాలని పేర్కొన్నారు. ఇందులో చైనా లేకపోవడం గమనార్హం.
జీ7పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారప్రతినిధి జావో లిజియన్ స్పందించారు. ‘అంతర్జాతీయ సంఘాలు, సదస్సులు దేశాల మధ్య సహకారం, సౌభ్రాతృత్వం, బహుళత్వం, ప్రపంచ శాంతి, అభివృద్ధి పెంచేవిగా ఉండాలన్నది చైనా నమ్మకం. ప్రపంచంలోని అధిక దేశాల పాత్ర ఇలాగే ఉంటుందని మేం భావిస్తాం. చైనా చుట్టూ ఓ వృత్తం గీసేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. జనాదరణ కోల్పోతాయి’ అని లిజియన్ అన్నారు.