గుంటూరు జిల్లాలో జన్మించి… కథానాయికగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా దక్షిణాది చిత్ర పరిశ్రమపైన తనదైన ముద్ర వేసిన కథానాయిక సరిత. 1980వ దశకంలో అగ్ర కథానాయికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓ వెలుగు వెలిగారు. ‘మరోచరిత్ర’తో సినీ ప్రయాణం ఆరంభించిన ఆమె ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో వరుసగా అవకాశాలు అందుకొన్నారు. దాదాపు 160 చిత్రాల్లో నటించారు. 1990 దశకంలో విజయశాంతి, టబు, సుస్మితా సేన్, రమ్యకృష్ణ, సౌందర్య తదితర కథానాయికలకి తమిళంలో డబ్బింగ్ చెప్పి అలరించిన నటి సరితే. రోజా, నగ్మా, సిమ్రాన్, సుహాసిని, రాధ, రాధిక, ఆర్తి అగర్వాల్‌లాంటి కథానాయికలకి తెలుగులో గాత్రం అందించారు సరిత. గుంటూరు జిల్లా మునిపల్లెలో జన్మించిన ఆమె 1978లో చిత్ర రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో తన చిన్న కుమారుడు శ్రవణ్ దగ్గర ఉంటున్నారు సరిత. విమర్శకుల మెప్పు పొందేలా నటించడంలో దిట్ట సరిత. ఆమెకి ఉత్తమ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆరు నంది పురస్కారాలు లభించాయి. తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. నేడు సరిత పుట్టినరోజు.
‘మరో చరిత్ర’ సమయానికి సరిత వయసు సుమారు 14 సంవత్సరాలు. ఎనిమిదో తరగతి చదువుతోంది. తన తండ్రికి స్నేహితుడైన సినీ రచయిత గణేష్ పాత్రో ఓరోజు ఇంటికి వచ్చి సరితను చూసి ముచ్చట పడ్డారు. ఆమెలో ఆయనకీ ఓ నటి కనిపించిందేమో…సినిమాల్లో నటిస్తావా? అంటూ ప్రశ్నించారు. సిగ్గుపడుతూ మొదట కాదన్నా… కమల్ హాసన్ సరసన నాయికగా నటించే అవకాశం అదని తెలుసుకున్న తరువాత ఒకే చెప్పింది. మర్నాడే ఆడిషన్‌కి హాజరవమంటూ కబురందడంతో కాబోయే హీరోయిన్ కదా…షాపింగ్ చేసుకుని కొత్త చీరలో ముస్తాబై వచ్చింది. ఆడిషన్‌లో నచ్చిన పాట పాడమనేసరికి ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట పాడి అందర్నీ ఆకట్టుకుంది. వెంటనే…ఆమె సెలెక్ట్ అయింది. విశాఖలో షూటింగ్. కమల్ హాసన్‌తో నటిస్తున్నానే సంబరంతో ఆమె ఆకాశంలో వెండి మబ్బుల్ని తాకింది. మొదటి రోజు షూటింగ్‌లో కమల్ హాసన్‌ని ముద్దు పెట్టుకునే సన్నివేశం. ఆమె అతడి చేతిమీద ముద్దు పెట్టుకుని… ‘తప్పా?’ అని అమాయకంగా అడగాలి. దానికి కమల్ హాసన్ ‘ముద్దు పెట్టుకున్న చోటే తప్పు’ అంటూ జవాబివ్వాలి. ఈ సన్నివేశం ఎన్నిసార్లు చేసినా ఒకే కావడం లేదు. దాంతో, నిరాశ పడిపోయింది. అయితే, మర్నాడు షూటింగ్‌లో పతాక సన్నివేశానికి ముందు వచ్చే సుదీర్ఘ సంభాషణ ఇచ్చారు. వెంటనే… చెప్పేయడంతో ‘మరో చరిత్ర’ హీరోయిన్‌గా నిలదొక్కుకోగలిగింది.
తెలుగు, తమిళం, కన్నడం మలయాళ భాషల్లో సరిత సుమారు 162 సినిమాలు చేసింది. అగ్ర దర్శకులందరి దగ్గర పనిచేసినా కె.బాలచందర్ దగ్గర 23 సినిమాల్లో ఆమె నటించింది. బాలచందర్ స్కూల్ ఆమెకి అచ్చొచ్చిందనే చెప్పాలి. బాలచందర్ తమిళంలో దర్శకత్వం వహించిన సినిమాల్లో సరిత తప్పక ఉండేది. బాలచందర్ సినిమాలో ‘ఇది కథ కాదు’, ‘తొలికోడి కూసింది’, ‘గుప్పెడు మనసు’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, ‘కోకిలమ్మ’, ‘తప్పు తలంగా’, ‘వండి చక్కరం’, ‘నెట్రిక్క’, ‘అగ్నిసాక్షి’, ‘పూతక్కవితే’, ‘కల్యాణ అగతిగల్’, ‘ఆచం మిల్లయే ఆచం మిల్లయే’, ‘తన్నీర్ తన్నీర్, ‘47 నాటికల్’, ‘నూల్ వెళ్లి’, ‘ముగల ముల్లిగ్’, ‘నేటి కథ, ‘ఈరదు రేఖా గల్’, ‘ది మార్కింగ్ క్లోక్ క్రోస్’, తదితర చిత్రాలున్నాయి. తెలుగులో చేసిన చిత్రాల్లో ‘విజయ’, ‘గూటిలో రామచిలుక’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అత్తగారి పెత్తనం’, ‘47 రోజులు’, ‘చందమామ’, ‘కలహాల కాపురం’, ‘ప్రేమ సాగరం’, ‘కాంచన గంగ’, ‘కలరుద్రుడు’, ‘అనురాగ బంధం’, ‘తోడూ నీడ’ లాంటి చిత్రాలు ఉన్నాయి.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సరిత తన ముద్ర వేసింది. అసలే తేనె తాగిన గొంతు, డైలాగ్ చెప్పినా సుస్వరాల మధురిమలే. ‘గోరింటాకు’, ‘చంటి’ సినిమాల్లో సుజాతకు, ‘స్వాతి’లో సుహాసినికి, ‘గుణ’లో రోషినికి, ‘ఆయనకు ఇద్దరు’లో వూహకి, ‘అనగనగా ఒక రోజు’లో ఊర్మిళకి, ‘ఇంద్ర’లో ఆర్తి అగర్వాల్‌కి, ‘కాదలన్, ‘భాష’, ‘లవ్ బర్డ్స’, ‘ఘరానా మొగుడు’, ‘అరవిందన్’ చిత్రాల్లో నగ్మాకు గాత్ర ధారణ చేసింది. ‘హాలు జేను’లో మాధవికి, ‘ఇజ్మాన్’, ‘ఒరు వూర్ల ఒరు రాజకుమారి’ చిత్రాల్లో మీనాకు గాత్ర ధారణ చేసింది. ‘ఎం.కుమారన్ సన్నాఫ్ మహలక్ష్మి’, ‘దృశ్యం’, ‘అత్తారింటికి దారేది’, ‘ఆ ఆ’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో నదియాకి డబ్బింగ్ చెప్పింది. ‘సఖీ’లో షాలినికి, ‘అమ్మోరు’, ‘పవిత్ర బంధం’, ‘అరుణాచలం’, ‘అంతఃపురం’, ‘మా ఆయన బంగారం’, ‘సూర్యుడు’, ‘తారకరాముడు’, ‘రాజా’, ‘అన్నయ్య’ చిత్రాల్లో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది. ‘డాడీ’, ‘అమృత’, ‘ సీమ సింహం’ చిత్రాల్లో సిమ్రాన్‌కి గొంతు అరువిచ్చింది. ‘బొబ్బిలి సింహం’, ‘బైరవ ద్వీపం’ చిత్రాల్ల్లో రోజాకు, ‘అజగన్’ చిత్రంలో మధుబాలకి, ‘పున్నగై దేశం’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో స్నేహకి గొంతు అరువిచ్చింది. ఆ వరుసలోనే రాధ, రమ్య కృష్ణ, మీనాక్షి శేషాద్రి, ఆమని, విజయశాంతి, అపర్ణ, సుధా చంద్రన్, సుస్మిత సేన్, టబు, జయభారతి, ఖుష్బూలకు గాత్రధారణ చేసింది.