DailyDose

ఏపీలో 199 కేసులు-TNI కరోనా బులెటిన్

ఏపీలో 199 కేసులు-TNI కరోనా బులెటిన్

* TV5 హైదరాబాద్ రిపోర్టర్ మనోజ్ కరోనాతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇవ్వాళ ఉదయం మృతి.

* అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన…కేంద్రం సడలింపు ఇచ్చినప్పటికీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సుల రాకపోకలపై కనిపించని అవకాశాలు.సరిహద్దు రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం.బస్ లు నడిపేందుకు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఏపీ సీఎస్‌ లేఖ .వీటిపై స్పందించని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు లేవంటోన్న ఆర్టీసీ అధికారులు.

* నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా శానిటైజర్ తాగిన అటెండర్ సత్తిబాబు

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 199 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 69 ఉండగా.. రాష్ట్రంలో 130 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,659 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,382కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1290 మంది చికిత్స పొందుతున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల వద్ద చెక్‌ పాయింట్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సరిహద్దుల వద్ద చెక్‌ పాయింట్లను యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వ నోడల్‌ అధికారి కృష్ణబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలోకి రావాలనుకునేవారు స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసేకోవాలని స్పష్టం చేశారు. అలా రాష్ట్రంలోకి వచ్చినవారు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.

* దాదాపు రెండు నెలలకుపైగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల వద్ద ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దర్శించుకుకేందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన ఆలయాలైన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో రేపటి నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయాల ఈవోలు వెల్లడించారు.

* కేరళలోని శ్రీ పద్మనాభస్వామి దేవాలయ దర్శనాలను ఈ నెల 9 నుంచి పునర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారి దేవస్థానంలో వర్చువల్‌ క్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయంలో ఒకసారి 35 మందిని మాత్రమే పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయంలో ఉదయం 8.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు భక్తులను అనుమతిస్తారు.