Business

ఇండియా నుండి విదేశాలకు డబ్బు ఇలా పంపవచ్చు

ఇండియా నుండి విదేశాలకు డబ్బు ఇలా పంపవచ్చు

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్‌ అవుట్‌వార్డ్‌ రెమిటెన్స్‌) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్‌ రెమిటెన్స్‌) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్‌బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌ రెమిటెన్స్‌ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్‌ అభ్యర్థనలను అదే రోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్‌బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు.