రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్-19 కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలు అనే తేడా లేకుండా వైరస్ బారిన పడుతున్నారు. నగర శివారులో కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. తాజాగా గ్రేటర్ పరిధిలో ఆదివారం 132 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కొన్ని రోజులుగా వందకు తగ్గకుండా నమోదవుతుండడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది. హుస్సేనీఆలం పరిధిలో ఓ ఇంట ముగ్గురు కుటుంబ సభ్యులు వైరస్‌తో మరణించటం విషాదాన్ని మిగిల్చింది. కొద్దిరోజుల వ్యవధిలోనే చికిత్స పొందుతూ తల్లీ, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎంతోమంది బంధుగణం ఉన్నా చివరి చూపులు దక్కకుండా అంత్యక్రియలు పూర్తి చేయడం వారిని కలిచివేసింది. కుటుంబ యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎప్పుడూ బయట ఉండే వీధి వ్యాపారులు, పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను పలు ప్రాంతాల్లో శ్మశానంలోకి అనుమతించట్లేదు. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు నచ్చజెప్పి చివరి మజిలీ పూర్తి చేయిస్తున్నారు. ఈనెల 4న వైరస్ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ టీవీ మీడియా జర్నలిస్టు ఆదివారం మరణించాడు. అతనికి కొద్ది కాలం కిందటే వివాహమైంది. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. జర్నలిస్టు మృతికి జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి.
తెలంగాణాలో విపరీతంగా పెరుగుతోన్న కరోనా
Related tags :