NRI-NRT

లండన్‌లో గాంధీ విగ్రహంపై జాతి వివక్ష రాతలు

లండన్‌లో గాంధీ విగ్రహంపై జాతి వివక్ష రాతలు

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో పలు దేశాల్లో నిరసనలు మిన్నంటాయి. అమెరికా తర్వాత యూకేలో అత్యధికంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిరసనకారులు టార్గెట్ చేశారు. గాంధీ విగ్రహం చుట్టూ జాత్యహంకార వ్యతిరేక సందేశాలతో ప్లకార్డులను పెట్టారు. అంతేకాకుండా విగ్రహం కింద భాగంలో జాత్యహంకారి(రేసిస్ట్) అని రాశారు. మహాత్మాగాంధీతో పాటు అనేక మంది ప్రపంచ నేతల విగ్రహాలపై నిరసనకారులు ఇదే విధంగా సందేశాలు రాశారు. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. మహాత్మాగాంధీ విగ్రహంపై దాడులను ఎన్నారైలు ఖండిస్తున్నారు. గాంధీ అంటే శాంతికి చిహ్నమని.. అటువంటి మహానేత విగ్రహాలపై దాడి చేయడం సరికాదని ఎన్నారైలు మండిపడుతున్నారు.