DailyDose

ఏపీలో 5000 దాటిన కరోనా-TNI బులెటిన్

ఏపీలో 5000 దాటిన కరోనా-TNI బులెటిన్

* జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)లో 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో ఎంఫాన్ తుపాను అనంతర సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బందిలో 50 మంది కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 170 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది.

* దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

* బిజెపి నేత ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఆయన తల్లికి కరోనా పాజిటివ్.

* ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఉదయం 10 గంటలవరకు కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 147 మంది కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు 69 మంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. ఇప్పటివరకు 5,029 మంది కరోనా బారినపడ్డారు.

* తెలంగాణలో సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం 22 అంశాలతో మార్గదర్శకాలను విడుదల చేసింది.

* చిత్రీకరణకు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.

* మెడికల్ క్లియరెన్స్ లేనిదే 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారిని అనుమతి లేదు.

* గరిష్ఠంగా 40 మంది సిబ్బందితోనే షూటింగ్ జరుపుకోవాలి.

* ఎక్కువగా ఇండోర్‌ చిత్రీకరణలు ఉండేలా చూసుకోవాలి.

* కంటైన్మెంట్ జోన్లలో చిత్రీకరణకు అనుమతి లేదు.

* నటీనటులు వాళ్ల ఆహారాన్ని, నీటిని ఇంటి నుంచే తెచ్చుకోవాలి.

* నటీనటుల వ్యక్తిగత మేకప్ కిట్స్ ఉండేలా చూసుకోవాలి.

* తెలంగాణలో ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయించింది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశల వారీగా లాక్ డౌన్‌ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ తర్వాత ప్రతి 15 రోజులకొకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘‘జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలో కేసుల విచారణ ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్ డౌన్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగించాలి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.