ఈ లోకం అఖండం. ఈ విశ్వం అఖండం. ఆత్మ అఖండం. సర్వం అఖండం. అంటే ఏకం. ఖండించలేని, ఖండించ వీలుకాని ఒకే ఒక్కటి. అయినా ఆ అఖండంలోనే అనేకం. మళ్లీ ఆ అనేకం ఏకం… ఇదేమి తిరకాసు? ఈ చిక్కులెక్క విప్పగలిగే ధీరుడు ఇంకా పుట్టలేదు. పుట్టడు కూడా. ఎందుకంటే అణువును విడగొట్టవచ్చు. విస్ఫోటనం చేయవచ్చు. కానీ భగవంతుడి సృష్టిలోని ఈ అణువును విడదీయడం, తిప్పి లెక్కచెప్పడం అసాధ్యం, అసంభవం. ఎందుకంటే- ఆ ఒకే ఒక్క అణువు లేదా పరమాణువు… ఆయనే.పసివాడు ఒకే ఇసుక కుప్పను గదులుగా, వసారాగా, కాంపౌండుగా, వంటగదిగా, స్నానంగదిగా మార్చి తన సరదా తీరగానే మళ్లీ అంతా కలిపేసి కకావికలం చేసి ఇసుకనంతా ఏకమాత్రం చేసినట్లు… భగవంతుడు తనతో కూడా కలిపిఉన్న కలిసిఉన్న ఈ అఖండత్వాన్ని ఖండికలుగా చేసి ఆడుతున్నదే- ఈ జగన్నాటకం. ఈ వింత నాటకంలో, ఈ అద్భుత లీలలో పావులమే మనం. పాత్రలమే మనం. నాటకాల్లో, చలనచిత్రాల్లో పాత్రల కోసం, వేషాల కోసం ఆ అభిరుచి కలిగినవాళ్లు అవకాశం కోరి ఎన్నో అగచాట్లు పడుతూ ఉంటారు. అయాచితంగా, అప్రయత్నంగా అద్భుతమైన నాటకంలో పాత్రధారులమయ్యే అవకాశం మనకు వచ్చింది. పాత్ర ఇచ్చి ఈ లోకంలోకి పంపేవరకే ఆయన పని. అలా లభించిన భూమికను మలచుకునే అవకాశం మనదే. మన ఇచ్ఛమేరకే, నటించే స్వేచ్ఛను మనకే ప్రసాదించాడు. ఒకసారి లోతుగా ఆలోచిస్తే బంగారాన్ని చేతుల్లో పెట్టి నగలు తయారు చేసుకుని వారినే వాడుకొమ్మని ఇచ్చినంత ఉదారమైన అవకాశమిది. ప్రాపంచికంగా సాధారణ విషయాల్లో అయితే మనకు పిచ్చి సంతోషంగా ఉంటుంది. కానీ ఇది ఆంతర్యపు వ్యవహారం. అనంతుడి వ్యవహారం. అందుకనే, ఓ పట్టాన మనకర్థం కాదు. ఇది ఒక జీవితకాలపు అపురూప వరం. మనమే నటించవలసిన, మనమే నడిపించవలసినదైనా మనకు కూడా అంతుపట్టని క్షణక్షణం వైవిధ్యభరితం, వైభవపూరితం అనుభవైకవేద్యమైన అద్భుత దృశ్య కావ్యం. దీన్ని ఎవరైనా వదులుకుంటారా, మధ్యలోనే విరమించుకుంటారా? మరుక్షణం ఏమవుతుందో కూడా అర్థంకాని, ఆలోచించలేని అప్రయత్న, అనుక్షణ ఉత్కంఠను పొందే అవకాశాన్ని అర్ధాంతరంగా తుంచివేసుకునే మూర్ఖులమా మనం!? ఒక సూక్ష్మ బీజ నిక్షిప్తమై అణువులా పొటమరించిన అంకుర లేశం పెరిగి మొక్కై, మొక్క మొగ్గై, మొగ్గ పువ్వై, పువ్వు పిందై, పిందె ఫలమై… ఇదెంత ఊహించని పరిణామం! జీవితమూ అంతే. ఒక చెట్టును పశువులు మేయవచ్చు. చీడపీడలు పట్టవచ్చు. ఫలించాక పక్షులూ కొట్టవచ్చు. అయినా చెట్టు ఎదగకమానదు. పూయక, కాయక ఆగదు. పుట్టగానే, పొటమరించగానే భవిష్యత్తు మీది బెంగతో మొలక పిలక వేయక మానదు. అంతే తప్ప, వడలిపోయి ఆత్మహత్య చేసుకోదు. బతికి ఉన్నా ఎండి మోడై ముక్కలు చెక్కలైనా తన కర్తవ్యాన్ని తన జన్మకారణాన్ని పూర్తి చేయక మానదు (ఇది జీవ లక్షణం. జీవిత లక్ష్యం కూడా). పరోపకార కార్యంలోనే, తన అంత్యక్రియలను, తన ‘దహన’ క్రియను అది తానే నిర్వహించుకుంటుంది! ఈ సూక్ష్మం మనకెందుకు అర్థం కాదు? స్వయం నిర్ణాయక శక్తిలేని మిగిలిన జీవరాశులన్నీ చరాచరాలు, చలాచలాలు తమకు తాము వీలైనంత ఉన్నతంగా మలచుకునే, గెలుచుకునే పనిలో నిమగ్నమై ఉండగా… మనిషికెందుకీ అలసత్వం, జీవితం మీద అకారణ ద్వేషం? నిజానికి జీవితమే ఒక మహాయజ్ఞం. శ్రద్ధగా నిర్వహిద్దాం!
జీవితమే మహాయజ్ఞం
Related tags :