మన దేహంలో కేవలం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మన జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. అదే 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్. బయటి వాతావరణం చాలా వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా మన ఒంట్లో ఎప్పుడూ ఇదే ఉష్ణోగ్రత ఉండేలా మెదడులోని ఒక మెకానిజమ్ తోడ్పడుతుంటుంది. బయటి వాతావరణంలోకి వెళ్లగానే ఒంటి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అయితే మన జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతే కావాలి కదా. అందుకే… చెమట పట్టేలా చేయమని స్వేద గ్రంథులను మెదడు ఆదేశిస్తుంది. చెమట పట్టగానే… బయటి నుంచి వీచే గాలి వల్ల మన చర్మంపైనున్న చెమట ఆవిరి అవుతుంటుంది. ఇలా ఆవిరి కావాలంటే చెమట నీటికి కొంత ఉష్ణోగ్రత అవసరం. అప్పుడా చెమటనీరు మన దేహంలోని లేటెంట్‌హీట్ అనే ఉష్ణాన్ని తీసుకుని ఆవిరైపోతుంది. ఇలా మన దేహంలోంచి కొంత ఉష్ణోగ్రత తొలగగానే ఆ మేరకు ఒళ్లు చల్లబడుతుంది. ఇలా మనం ఎండలోకి వెళ్లగానే చల్లబరిచే ప్రక్రియ అదేపనిగా జరుగుతూ దేహ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా మెదడులోని మెకానిజమ్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అంటే మన దేహంలోని ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి నీళ్లు అవసరమన్నమాట. ఒకవేళ దేహంలో తగినంత నీళ్లు లేవనుకోండి. అప్పుడు చెమట పట్టడానికి అవసరమైన నీరు లేక దేహం చల్లబడే ప్రక్రియ జరగదు. అప్పుడు చర్మంలోకి రక్తం ఎగజిమ్మినట్టుగా చర్మం ఎర్రబారిపోతుంది. ఇదే వడదెబ్బ తగలడానికి ముందుగా కనిపించే తొలి లక్షణం. ఇలాంటి సమయాల్లో ఒంట్లోకి తగినన్ని ద్రవాలను భర్తీ చేయాలి. ఇందుకోసం నీళ్లు, ఖనిజ లవణాలను అందించాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు గుక్కవేయవద్దు. ప్రతిసారీ చిన్న చిన్న గుక్కల్లో తాగుతూ ఉండాలి. నీళ్లు మరీ చల్లగాగాని, మరీ వేడిగా గాని ఉండకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ఏదైనా తినడానికి అరగంట ముందు నీళ్లు తాగడం మంచిది. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఎందుకంటే నీళ్లతోపాటు గ్యాస్ కూడా లోపలికి వెళ్లి తగినంతగా తినలేరు. పైగా ఆ గ్యాస్ పైకి తన్నుతూ ఉండటం వల్ల పైకి తేన్పుల్లా వస్తుంటాయి. అందుకే ఆహారం సాఫీగా లోపలికి వెళ్లడానికి ఒక అరగ్లాసు నీళ్లు గుటక వేస్తే చాలు. ఆ తర్వాత మళ్లీ దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా నీళ్లు తాగాలి. శరీరంలో నిద్ర సమయంలో లోపించిన ద్రవాలు భర్తీకి ఇది ఒక మంచి మార్గం. అంతేకాదు… ఇలా తాగడం వల్ల నిద్రించే సమయంలో మన శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను కూడా తొలగిస్తాయి. వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లు తాగాలి. అయితే వెంటనే కాకుండా కాస్త వ్యవధి ఇచ్చి తాగాలి. డీహైడ్రేషన్‌కూ, శరీరంలో
విషపదార్థాలకూ ఆస్కారం ఇచ్చే కూల్‌డ్రింక్స్ లాంటి ద్రవపదార్థాలను వీలైనంతగా తగ్గించాలి.
ఎండాకాలం నీరు ఎక్కువగా తాగండి
Related tags :