* కరోనా వైరస్ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్నట్టు లెక్క. చైనా, కెనడా వంటి దేశాలను కూడా దాటి పోయి రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.
* ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో మునిగిపోయిన పురాతన ఆలయం బయటపడింది. ఈ ఆలయం దాదాపు 500 ఏండ్ల క్రితం నాటిదని పురాతత్వశాఖ పరిశోధకులు తేల్చారు. కటక్‌లోని పద్మావతి ప్రాంతంలోని బైదేశ్వర్ సమీపంలోని మహానదిలో చేపట్టిన ఒక ప్రాజెక్టులో భాగంగా జరిపిన తవ్వకాల్లో 60 అడుగుల లోతులో ఈ గుడిని కనుగొన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఆలయం 15 వ శతాబ్దం చివరలో లేదా 16 వ శతాబ్దం ఆరంభంలో నిర్మించి ఉంటారని, మస్తాకా శైలిలో నిర్మాణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్థానిక వారసత్వ ఔత్సాహికుడు రవీంద్ర రానా సాయంతో ఇంటాచ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీపక్ కుమార్ నాయక్ ఈ ఆలయాన్ని గుర్తించారు.
* తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా బారినపడ్డారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నలతగా ఉండడంతో నిన్న బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి కరోనా పరీక్షలు నిర్విహించారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అవగా.. భార్యకు నెగెటివ్ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దంపతులు హైదరాబాద్‌కు బయలుదేరారు.
* యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో నవంబర్ మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి (పీక్) చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడు ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని అంచనా వేసింది. అయితే, 8 వారాల లాక్డౌన్ వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం కొద్దికాలం పాటు వాయిదా పడిందని తెలిపింది. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్డౌన్ ఉపయోగపడిందని తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఏర్పాటు చేసిన ఆపరేషన్ రీసెర్చి గ్రూప్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
* ‘ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన వైకాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగలేదనే పగ సాధిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉండగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 253గా ఉంది.
* టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఆసుపత్రిలోని రెండో అతస్తు గదికి తరలించారు. జ్యుడీషియ్ల్ కస్టడీలో ఉన్నందున పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు.
* దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడేది లేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ ఇక ఏమాత్రం బలహీన దేశం కాదని తెలిపారు. జమ్మూకశ్మీర్ భాజపా శ్రేణులను ఉద్దేశిస్తూ నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పొరుగు దేశాలతో వివాదాలను దాచి పెట్టేదే లేదని.. సరైన సమయంలో పార్లమెంటు ముందు అన్ని వివరాలను ఉంచుతామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
* కక్షసాధింపు ధోరణి వీడి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి, సీఎం జగన్ మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతిలో ఆయన మీడియా మాట్లాడారు. ఇష్టారీతిలో మద్యం, ఇసుక మాఫియాని పోషిస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
* బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ‘నేను షాక్‌కు గురయ్యా.. ఇది నిజం కాదు’ అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది ఎంతో విషాదకర వార్త. బాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని నటుడు అజయ్ దేవగణ్ విచారణ వ్యక్తం చేశారు.
* దక్షిణ కొరియాపై గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు మీదుగా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా వస్తున్న కరపత్రాల విషయంలో దక్షిణ కొరియా తీరు మార్చుకోకపోతే.. సైనిక చర్యకు వెనకాడమంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాను శత్రుదేశంగా పేర్కొనడం గమనార్హం.
* దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో పాటు పలువురు అన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీ ఆసుపత్రుల్లో ఏర్పడ్డ పడకల కొరత దృష్ట్యా తక్షణమే 500రైల్వే ఐసోలేషన్ బోగీలను కేటాయిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. దిల్లీలో కరోనా వైరస్‌ని నియంత్రించడంలో భాగంగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేపడతామని హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
* చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. చమురు ట్యాంకరు పేలి 19 మంది మృతి చెందారు. మొత్తం 166 మంది గాయపడ్డారు. షాన్యాంగ్ హైకూ సమీపంలోని ఒక ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఈ ప్రమాదం జరిగింది. తొలుత ఒక పేలుడు జరిగింది ఈ తీవ్రతకు ట్రక్కు ఒక వర్క్‌షాప్‌పై పడింది. ఇది భారీ పేలుడుకు దారితీసింది. పేలుడు తీవ్రతకు ఆప్రాంతం మొత్తం అగ్నిగోళం వలే మారిపోయింది.