Business

గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వజ్రాలు

గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వజ్రాలు

అవును… కరోనా దెబ్బకు వజ్రానికీ వైరెస్‌ పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు తవ్వింది తవ్వినట్టు మార్కెట్‌లోకి వెళ్లిపోయే సరుకు… ఇప్పుడు కొనేవారే లేక పరిశ్రమ కుదేలయింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు గనుల్లో పేరుకుపోయాయి. ఈ నష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక వజ్రాల గనుల కంపెనీల యజమానులు తలలు పట్టుకొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానా రాజధాని గాబొరోన్‌లోని గనుల్లో అయితే వజ్రాలు కుప్పలుతెప్పలుగా పడున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల గనులున్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ప్రసిద్ధ మైనింగ్‌ కంపెనీ ‘డీ బీర్స్‌’ ఇక్కడ మైనింగ్‌ చేస్తోంది. అయితే ఫిబ్రవరి నుంచి ఒక్క వజ్రం కూడా అమ్మలేకపోయింది. ఇక ‘డీ బీర్స్‌’కు పోటీ మైనింగ్‌ సంస్థ ‘అల్‌రోసా పీజేఎస్‌సీ’ది కూడా అదే పరిస్థితి. ఇది రష్యా కంపెనీ. కరోనా వజ్రాల ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. నగల దుకాణాల తలుపులు మూసుకు న్నాయి. ‘డీ బీర్స్‌’ అయితే మార్చి మాసంలో అమ్మకాలను రద్దు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోవడంతో సరుకు చూసేందుకు బయ్యర్లు రావడం లేదు. మరోవైపు ధర తగ్గించేందుకు మైనర్లు సిద్ధంగా లేరు. దీంతో సంస్థ ఈ నిర్ణయం సుకోవాల్సివచ్చింది. ‘డీ బీర్స్‌’తో పాటు ‘అల్‌రోసా’ కూడా నష్ట నివారణ చర్యలకు దిగాయి. స్టాక్‌ను తగ్గించుకొనేందుకు ప్రొడక్షన్‌ను భారీగా తగ్గించాయి. అదే సమయంలో తమ మార్కెట్‌ను చేజారకుండా చూసుకొనే పనిలో పడ్డాయి. భారత్‌లో కూడా నగల వ్యాపారం పూర్తిగా మందగించింది. కటింగ్‌, పాలిషింగ్‌ చేసేవారు ఇంటికే పరిమితమవ్వడంతో ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. ‘జెమ్‌డాక్స్‌’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు దిగ్గజ మైనింగ్‌ కంపెనీల వద్ద 350 కోట్ల డాలర్ల విలువ చేసే అదనపు నిల్వలున్నాయి. సంవత్సరాంతానికి ఇది 450 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఖరీదైన వజ్రాలన్నీ ఇప్పుడు ఇలా కొనేవాళ్లు లేక కుప్పలుగా పోసి ఉండడం చూస్తే… ఒకప్పుడు మన చరిత్రలో రత్నాలను రాశులుగా పోసి వీధుల్లో అమ్మిన కథలు గుర్తుకొస్తున్నాయి కదూ!