Agriculture

మొక్కజొన్నలో కలుపు అదుపు ఇలా

TNILIVE Telugu Agriculture News || How To Control Weed In Corn Crop

వరి కోతల అనంతరం మాగాణుల్లో జనవరి మొదటి పక్షం వరకు నేలను దున్నకుండానే (జీరోటిల్‌) మొక్కజొన్నను విత్తవచ్చు. ఈ పద్ధతిలో దుక్కి చేయడం ఉండదు కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని సమగ్ర కలుపు నివారణ కేంద్రం (ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం) శాస్త్రవేత్తలు ఈదర వెంకటేశ్వర్లు, (సెల్‌:9849865759)డాక్టర్‌ బి.ప్రమీలరాణి తెలిపారు. కలుపు నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. చేపట్టాల్సిన యాజమాన్యం
* గరిక, చిప్పెర, ఉర్రంకి, ఊద, పిచ్చి తోటకూర, గలిజేరు, గునుగు, నేల ఉసిరి, వామింట, గుంటగలవిరి, టపాకాయల చెట్టు, ముక్కు పుడకాయ, మారల మాతంగి తదితర గడ్డిజాతి కలుపు ఎక్కువగా మొలుస్తుంది.
* కలుపును సకాలంలో నివారించకపోతే దిగుబడి 74 శాతం వరకు తగ్గుతుంది.
* పంట విత్తిన 45 రోజుల వరకు కలుపు లేకుండా చేయాలి.
* మాగాణులో విత్తడం వల్ల నేల గట్టిబడి కలుపును చేతులతో తీయడం కష్టమవుతుంది.
* పంట విత్తిన 1-2 రోజుల్లో ఎకరానికి కిలో అట్రజిన్‌ (50 శాతం డబ్ల్యూపి) + లీటరు పారాక్వాట్‌ (24 శాతం) 200 లీటర్ల నీటికి కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే కలుపు అదుపులో ఉంటుంది.
* పొలం చుట్టుపక్కల అపరాలు సాగు చేస్తే.. అట్రజిన్‌కు బదులు పెండిమిథాలిన్‌ (30 శాతం) ఎకరానికి లీటరు పిచికారీ చేయాలి.
* వెడల్పాకు కలుపు నివారణకు పైరు 20-30 రోజుల దశలో ఎకరానికి 400 గ్రాములు 2,4-డి సోడియం సాల్ట్‌ (80 శాతం డబ్ల్యూపి) పిచికారీ చేయాలి. ఈ మందు గడ్డి జాతికి చెందిన గరిక, ఊద, ఉర్రంకి కలుపును నివారించలేదు.
* గడ్డి, ఆకుజాతి కలుపు నివారణకు.. ఎకరాకు 115 మి.లీ. టెంబోట్రయోన్‌ (34.4 శాతం) లేదా 30 మి.లీ. ట్రోపిమిజోన్‌ (33.6 శాతం) కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు మొక్కజొన్న పైరుపై పడినా ఎటువంటి నష్టం ఉండదు.