తిప్పి కొడితే మూడుకోట్లు కూడా లేని జనాభా.. ఆర్థికంగా అంత బలంగా లేని దేశం. కష్టకాలంలో భారత్ దగ్గర చేయి చాచినా అన్ని మరచి ఎగిరెగిరి పడుతోంది. ఒకదాని తర్వాత మరొక సమస్యను సృష్టిస్తోంది. పాకిస్థాన్, చైనా అనుకుంటే నేను అంతే అంటోంది. ఇది ప్రస్తుతం నేపాల్ వ్యవహరిస్తున్న తీరు. అసలు నేపాల్ ఎందుకిలా మారిపోయింది? ఏం ఆశించి ఇలా చేస్తోంది? ఈ చిన్న దేశం వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? తెరవెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? పరిపాలనలో రాచరికపు అనవాళ్లు కల్గిన పర్వతదేశం నేపాల్. జనాభా రెండు కోట్ల తొంబై లక్షలు. చిన్న చిన్న విభేదాలు మినహా ఇటీవలి కాలం వరకు భారత్‌కు మంచి మిత్ర దేశం. 2015 భూకంపం సహా అనేక సందర్భాల్లో భారత్ నుంచి ఇతోధిక సాయం పొందిన దేశం. అలాంటి నేపాల్ ఇప్పుడు భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. చేసిన సాయాన్ని మరచి భారత్‌తో మడతపేచీలకు దిగుతోంది. మిత్ర ధర్మానికి పదేపదే తూట్లు పొడుస్తోంది. ఒక వైపు భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ కుటిల యత్నాలు. మరో వైపు తూర్పు లద్దాక్‌లో చైనా సైన్యం దుందుడుకు చర్యలు ఇవి చాలవన్నట్టు మధ్యలో ఇప్పుడు నేపాల్ పేచీలు. భారత్‌లోని ప్రాంతాలు మావేనంటూ మ్యాప్ తయారీ, సరిహద్దుల వద్ద భారతీయులపై దాడి, ఇప్పుడు బిహార్‌లో నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద గొడవ. ఇలా వరుస చర్యలతో భారత్‌కు పక్కలో మరో బల్లెంలా తయారైంది నేపాల్. భారత్‌లోని భూభాగాలను తమవేనని నేపాల్ వాదిస్తోంది. ఉత్తరాఖండ్‌లో కాలాపానీ లిపులేక్, లింధియాథుర ప్రాంతాలు తమవేనంటూ రూపొందించిన కొత్త మ్యాపుకు ఇటీవలే నేపాల్ పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. నేపాల్ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ నేపాల్ మధ్య ఉన్న ప్రతికూల పరిస్థితులను వేరొక దేశం తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి విశ్లేషిస్తున్నారు నిపుణులు.
నేపాల్‌ను ఉసిగొల్పుతున్నది ఎవరు?
Related tags :