Movies

పౌరాణిక చిత్రాల చిరునామా…కామేశ్వరరావు

పౌరాణిక చిత్రాల చిరునామా…కామేశ్వరరావు

పౌరాణిక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమలాకర కామేశ్వరరావు. ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా చూపించినా.. ‘పాండురంగమహత్యం’లో డీ గ్లామర్డ్ గా చూపించి మెప్పించినా ఆయనకే చెల్లింది. తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో భక్తి మార్గం పట్టించిన ఘనుడాయన. ఆయన తీసిన సినిమాలు.. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. కమలాకర కామేశ్వరావు 1911 అక్టోబర్ 4న మచిలీపట్నంలో జన్మించారు. అక్కడే బి.ఎ పూర్తి చేశారు. మొదట్లో కృష్ణా పత్రికలో సినిఫాన్ పేరుతో సినిమా రివ్యూలు రాసేవారు. అదే ఆయన్ను సినిమా రంగంలోకి అడుగులు వేసేలా చేశాయి. 1936లో ఆయన సినిమాల మీదున్న ఇంట్రెస్ట్‌తో మ ద్రాస్ చేరారు.స్క్రిప్ట్ మీదున్న పట్టువల్ల.. మొదట్లో రైటర్‌గా వర్క్ చేశారు. అదే సమయంలోనే కె.వి. రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. ఆయనతో కలిసి అనేక సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు.

కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘చంద్రహారం’. ఇది జానపద సినిమాగా తెరకెక్కింది. ఇదే సినిమాను తమిళ వెర్షన్‌లో కూడా చేశారు. అక్కడా ఈ మూవీ ప్లాప్ అయింది. ఆ తర్వాత తీసిన ‘పెంకి పెళ్లాం’ సినిమా కూడా సరిగా నడ్వలేదు. దాంతో కమలకర కామేశ్వరావుపై ప్లాప్ డైరెక్టర్ ముద్రపడింది.ఆ తరువాత తన స్టైల్ మార్చుకుని ఎన్టీఆర్‌తో కలిసి ‘పాండురంగ మహాత్మ్యం’ అనే పౌరాణిక సినిమా చేశారు కామేశ్వరరావు. ఈ సినిమా హిట్ అయ్యింది. కామేశ్వరరావుకు ఇది మొదటి హిట్టే కాదు…ఆయన సినీ కెరీర్ లోనే ఫస్ట్ బిగ్గేస్ట్ హిట్. అప్పటి వరకు గ్లామర్ హీరోగా వెలిగిన ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో కోణంలో చూపించి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాతి కాలంలో ఈ చిత్రాన్నే ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ‘పాండురంగడు’ గా రీమేక్ చేసాడు.ఆతర్వాత వరుసగా ‘శోభ’, ‘రేచుక్క పగటి చుక్క’, ‘మహాకవి కాళిదాసు’ ‘మహామంత్రి తిమ్మరుసు’ లాంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చి హిట్స్ అందుకున్నాయి. ‘మహాకవి కాళిదాసు’, ‘మహామంత్రి తిమ్మరుసు’ సినిమాలకు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు కామేశ్వరరావు.

1962లో వచ్చిన ‘గుండమ్మకథ’, ‘మహమంత్రి తిమ్మరుసు’ వంటి వరుస సక్సెస్‌లతో బాక్సాఫిస్ దగ్గర కామేశ్వరావు పేరు మారుమ్రోగిపోయింది. ‘గుండమ్మ కథ’ సినిమా కుటుంబ కథా చిత్రంగా కామేశ్వరరావుకు మంచి పేరు తెచ్చుకుంది.

కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మరో హిట్ మూవీ ‘నర్తనశాల’. ఈ సినిమాతోనే ఎస్.వి.రంగారావుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొచ్చింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని ఉత్తమ నటుడిగా ఎస్వీఆర్ అవార్డు అందుకున్నారు.

అంతకు ముందు కమలాకర దర్శకత్వంలో వచ్చిన ‘పాండవ వనవాసం’ సినిమా కూడా కామేశ్వరరావుకు మంచి పేరు తీసుకొచ్చింది. పౌరాణిక సినిమాల్లో అదే ఆయన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత ‘శకుంతల’, ‘శ్రీకృష్ణతులాభారం’, ‘కాంభోజరాజు కథ’, ‘శ్రీకృష్ణావతారం’, ‘కలిసిన మనసులు’, ‘వీరాంజనేయ’ లాంటి సూపర్ హిట్ సినిమాలు దర్శకుడిగా ఆయన ఖ్యాతిని పెంచాయి.

పౌరాణికాల మీదున్న పట్టుతో 1972లో కామేశ్వరరావు పిల్లలతో ‘బాల భారతం’ సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక1970 ద్వితీయార్థానికి తెలుగులో పౌరాణికాలకు ఆదరణ పెరిగింది. ఒక రకంగా ఎన్టీఆర్ పౌరాణిక హీరోగా ఒక వెలుగు వెలగడంలో కమలకర కామేశ్వరరావు తీసిన సినిమాలే కీ రోల్ పోషించాయి. రామారావు కూడా కమలకర కామేశ్వరరావును తన గురువుగా భావించేవారు.

అప్పట్లో ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ మూవీకి పోటీగా కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులతో కమలకర కామేశ్వరరావు ‘కురుక్షేత్రం’ సినిమాను తెరకెక్కించారు. రామారావు ‘దాన వీర శూర కర్ణ’తో పోలిస్తే.. ఎంతో ఉన్నతంగా సినిమాస్కోప్ టెక్నాలజీతో ఇతిహాసాన్ని వక్రీకరించకుండా ఆయన తెరకెక్కించిన ‘కురుక్షేత్రం’ మూవీకి బాగుందని ప్రశంసలు దక్కినా..ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తూ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ‘దాన వీర శూర కర్ణ’ ముందు ‘కురుక్షేత్రం’ మూవీ నిలబడలేక పోయింది.

‘కురుక్షేత్రం’, తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ వనవాసం’, ‘వినాయక విజయం’, ‘వాసవీ కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం’, ‘సంతోషిమాత వ్రత మహాత్మ్యం’, ‘శ్రీదత్త దర్శనం’, ‘అష్టలక్ష్మి వైభవం’, ‘ఏడుకొండల స్వామి’ లాంటి పౌరాణిక సినిమాలెన్నో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి.

దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావు పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలు ఇలా అన్నిజానర్ సినిమాలు చేసినా… ఆయనకు పేరు సంపాదించి పెట్టినవి మాత్రం పౌరాణికాలే. అందుకే ఆయన్ని అందరు తెలుగు వెండితెర పౌరాణిక బ్రహ్మగా కీర్తిస్తారు. ఎన్నో అపురూపమైన చిత్రాలలో ప్రేక్షకుల మనసు దోచుకున్న కామేశ్వర రావు 1998 జూన్ 29న కన్నుమూశారు. ఆయన మన మధ్య లేకపోయినా..ఆయన సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరంజీవిగా కొలువై ఉన్నారు.