మీ దగ్గర బెత్తం తీసుకొని మీ స్నేహితులను కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలానే ఉంది. అమెరికాలోని అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హ్యాకింగ్ టూల్స్‌ను చైనాకు చెందిన గూఢచారులు తస్కరించారు. వాటిల్లో మార్పులు చేసి అమెరికా మిత్రదేశాలు, ఆసియా, యూరప్‌లోని ప్రైవేటు కంపెనీలపై దాడులు చేశారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ సిమాంటిక్ వెల్లడించింది. ఇలా జరగడం ఇదే తొలిసారి. చైనా ప్రభుత్వం కోసం పనిచేస్తున్న బకీస్ అనే హ్యాకర్ల బృందం ఎన్ఎస్ఏకు చెందిన రెండు హ్యాకింగ్ టూల్స్‌ని హ్యాక్ చేశారు. వీటిలో మార్పులు చేసి అమెరికా మిత్రదేశాలైన బెల్జియం, లక్సంబర్గ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్‌లోని పరిశోధనా కేంద్రాలు, విద్యా సంస్థలు, కంప్యూటర్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకొన్నారు. సాధారణంగా ఎన్ఎస్ఏ ఈ టూల్స్‌ను చైనాకు వ్యతిరేకంగా వినియోగిస్తుంది. ది బకీస్ గ్రూప్‌నకు ఆ టూల్స్ ఎలా చేరాయనేది సిమాంటిక్ చెప్పలేకపోతోంది. తాజాగా అమెరికా తన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని కీలక టూల్స్‌పై పట్టు కోల్పోయినట్లు సమాచారం. ఇది ఒక వ్యక్తి నుంచి తుపాకి లాక్కోని అతన్నే కాల్చేయడం వంటిదని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా నుంచి అపహరించిన మాల్వేర్టూల్స్తోనే అమెరికా రక్షణ రంగ కంపెనీలనే లక్ష్యంగా చేసుకొన్నాయి. దీంతో చైనాకు చెందిన సైబర్ హ్యాకర్లు అమెరికా సైబర్ హ్యాకర్ల కంటే బలోపేతంగా ఉన్నారన్న విషయం స్పష్టమైంది. మరోపక్క ఎన్ఎస్ఏ ఈ నివేదికపై నోరు మెదపట్లేదు.