ప్రపంచవ్యాప్తంగా కమ్మేసిన కరోనా అన్ని దేశాలనూ గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే లక్ష్యంగా ఆయా దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కుదేలైన తమ ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలను దశల వారీగా తీసుకుంటూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో లాక్‌డౌన్ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే.. నిబంధనలు అతిక్రమించిన ఓ దేశ ప్రధాని ఏకంగా రూ.13వేలు జరిమానా కట్టారంటూ మోదీ ప్రస్తావించారు. దీంతో మోదీ చెప్పిన ఆ ప్రధాని ఎవరు? ఎందుకు జరిమానా కట్టాల్సి వచ్చింది? అనే చర్చ మొదలైంది. యూరప్ ఖండంలోని ఓ దేశం బల్గేరియా. 69,48,445 మంది జనాభా ఉన్న ఆ దేశంలో కూడా కరోనా మహమ్మారి వ్యాపించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్ విధించడంతో పాటు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరిచేస్తూ కఠిన నిబంధనలను అమలుచేసింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరోగ్యశాఖ కఠిన శిక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ దేశ ప్రధాని బోయ్కో బొరిస్సోవ్‌కు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు 300 లెవ్స్ (రూ.13వేలు) జరిమానా విధించారు. బోయ్కో బొరిస్సోవ్ ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించలేదు. దీన్ని గుర్తించిన అధికారులు ఆయనకు భారీ జరిమానా విధించారు. ఆయనొక్కరికే కాదు.. ప్రధాని వెంట వెళ్లిన కొందరు పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా జరిమానా విధించారు.
మాస్క్ పెట్టుకోలేదని ₹13వేలు జరిమానా కట్టిన ప్రధాని
Related tags :