సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమాపై పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. ఇక ఈ విషయంపై.. మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐని సంప్రదించగా.. తమకు ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై మాట్లాడేందుకు బాలస్వామి నిరాకరించారు. కాగా అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక పరిణామాలు, జైలు శిక్ష అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో జూన్ 21 ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ..‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
వర్మపై ప్రణయ్ తండ్రి కేసు
Related tags :