చంద్రబాబు వైఫల్యాలు-1.టీటీడీను వ్యాపారకేంద్రంగా మారుస్తున్న “ఉత్తరాధికారి”-TNI ప్రత్యేకం


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా సందర్భాలలో దూకుడుగా ముందుచూపుతోనూ వ్యవహరిస్తూ ఉంటారు. రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. చంద్రబాబు దృష్టికి రాకుండా పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి. దీనితో పాటు చంద్రబాబుకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ శీర్షికను ప్రారంభించడం జరిగింది. గ్రామస్థాయి నుండి అమరావతి స్థాయి వరకు పరిపాలనలో జరుగుతున్న, లోటుపాట్లను చర్చించే కథనాలు ఇందులో ఉంటాయి. మీరు కూడా దీనిలో పాలు పంచుకోవచ్చు. మీరు పంపే కథనాలను మీ పేరు మీదగానే దీనిలో ఉంచుతాం. దీనిలో భాగంగా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అవకతవకలపైనా, ప్రజల ఇబ్బందులపైనా ఇస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఆసక్తిగా చదవండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ సూచనలు, సలహాలకు స్వాగతం.

*** టీటీడీలో అన్నగారి అడుగుజాడలేవి?
ఎన్టీ రామారావు పరిపాలన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకువచ్చిన సంస్కరణలను ఆయనకు ప్రపంచ స్థాయిలో మంచి పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి వరకు అవకతవకల పుట్టగా ఉన్న టీటీడీలో ఎన్టీఆర్ పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. సామాన్యులకు దేవుడి దర్శనం అందుబాటులోకి తెచ్చారు. అప్పటి వరకు మహాద్వారం గుండా చోటామోటా నాయకులు సైతం యథేచ్ఛగా గర్భగుడిలోకి వెళ్లి వచ్చేవారు. దానికి ఎన్టీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల్లో ఉండే వారు తప్ప మిగిలిన వారంతా క్యూకాంప్లెక్స్ నుండి వెళ్ళే పద్ధతిని ఖచ్చితంగా అమలు చేశారు. ఎన్టీఅర్ హయాంలోనే తిరుమలలో అన్నదానాన్ని చేపట్టారు. దీనికి అపూర్వమైన ఆదరణ లభించింది. కోట్లాది రూపాయలు విరాళాల్లో వచ్చి పడ్డాయి. దైవభక్తీ మెండుగా ఉండేవారినే ఎన్టీఆర్ పాలకమండలి ఛైర్మెన్‌లుగా, సభ్యులుగా నియమించేవారు. ప్రముఖ ఆడిటర్ డీ.సీతారామయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కోట్లాది రూపాయలు విరాళాలుగా అందజేసిన పల్లెంపాటి వెంకటేశ్వర్లు వంటి వారిని టీటీడీ పాలకమండలి అధ్యక్షులుగా నియమించారు. పాలకమండలి నియామకంలో ఎన్టీఅర్ ఎక్కడా రాజీపడలేదు. పీ.వీ.ఆర్.కే.ప్రసాద్ వంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న ఐఏఎస్ అధికారులనే ఈవోలుగా నియమించారు. పలుసేవలు, పూజలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. టీటీడీలో రాజకీయ జోక్యం లేకుండా పరిపాలన సాగింది.

*** టీటీడీలో బయటపడిన చంద్రబాబు బలహీనత.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన ప్రస్తుతం పతాక అధ్వాన స్థితికి చేరుకుంది. రోజురోజుకూ అక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయి. కొండపైన అవినీతి అవకతవకలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. అధికారం ఉన్నవాడికి, వారి బంధువులకే గర్భగుడిలో దర్శనాలు అందుతున్నాయి. రోజులు తరబడి క్యూలలో వేచి ఉండి, దూరంగా ఉండి ఒక్క సెకను పాటు వెంకన్న స్వామీ దర్శనం చేసుకోవాలనుకున్న సామాన్యుడికి దేవుడి ముందు చీత్కారాలు, చేతులు పట్టి లాగేయడం, వెనుక నుండి ఆలయ సిబ్బంది బలవంతంగా నెట్టి వేయడం వంటి చర్యలతో సామాన్యులు ఆ దేవదేవుడికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం కూడా పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారులే తిరుమలకు ఈవోలుగా పనిచేశారు. ఈ విషయంలో చంద్రబాబు మాత్రం ఘోరమైన తప్పిదాన్ని చేసి తెలుగువారి మనోభావాలను దెబ్బతీశారు. కేంద్రంలోని పెద్దల ఒత్తిళ్లకు లొంగి ఒక “ఉత్తరాధికారి”ని కార్యనిర్వహణాధికారిగా నియమించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదం. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ కోటరీ, పత్రికలూ ఈ విషయాన్ని సమర్ధిస్తూ ప్రకటనలు చేసినప్పటికీ చంద్రబాబు చేసిన పొరపాటు సరిదిద్దుకోలేనిది. చంద్రబాబు బలహీనత ఇంకొకటి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి నుండి ఇతర ఐఏఎస్ అధికారులు రెండేళ్లకు మించి పదవుల్లో ఉండరు. అంతెందుకు…మండల స్థాయిలో ఉన్న ఎస్సై, ఎమ్మార్వోలను సైతం రెండేళ్లకు మించి కొనసాగనివ్వరు. అటువంటిది అత్యున్నతమైన పుణ్యక్షేత్రంలో జేఈవోగా శ్రీనివాసరాజును గత పది సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. అతను తప్ప సమర్థుడైన ఐఏఎస్ అధికారులు చంద్రబాబుకు కనిపించలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఒత్తిళ్లకు తలొగ్గి చంద్రబాబు జేఈవోగా శ్రీనివాసరాజును సుదీర్ఘకాలం నుండి కొనసాగిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
jeo srinivasa raju ttd tnilive 2018 business mindset ttd tirumala tirupati venkanna in danger
*** పాలకవర్గం విషయంలోనూ అదే తప్పు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం రెండేళ్లపాటు టీటీడీ పాలక మండలిని నియమించకలేకపోయారు. అనంతరం చదలవాడ కృష్ణమూర్తి నాయకత్వంలో ఉన్న పాలకవర్గం పదవీవిరమణ చేసి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ చంద్రబాబు సమర్థుడైన ఛైర్మన్‌ను ఎంపిక చేయలేకపోతున్నారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను చైర్మన్‌గా నియమించాలని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు సమాచారం. అన్యమత ప్రచారంలో సుధాకర్ పాల్గొన్నారని ఇటీవల వార్తలు రావడంతో చంద్రబాబు ఆయన నియామకంలో వెనుకా ముందు ఆడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది.

*** వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారు.
ప్రతి రోజు కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించే కానుకలతో ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడైన దేవుడిగా తిరుమల వెంకన్న పేరు గడించారు. తెలుగు ప్రజల మనోభావాలు అర్థం చేసుకోలేని ఉత్తరాధికారి అనీల్‌కుమార్ సింఘాల్ క్రమేపి తిరుమలను వ్యాపారకేంద్రంగా మారుస్తున్నారు. ఆయన చర్యలు తిరుమల దర్శనం, ప్రసాదాలను సామాన్య భక్తులకు దూరం చేసే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు 25రూపాయలు ధర పలికిన కళ్యాణం లడ్డుగా పేరు పొందిన పెద్ద లడ్డు నేడు ఏకంగా 200 రూపాయలు ధర పెంచేశారు. భక్తులు అపురూపంగా భావించే ‘వడ’ ఒకప్పుడు 5 రూపాయలు ఉండగా దాని ధర 100 రూపాయలుగా పెంచేశారు. పది రూపాయలకు లభించే చిన్నలడ్డు రూ.50కు పెంచేశారు. వివిధ సేవల ధరలను పెంచారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు భారీగా పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని వసతి గృహాల ధరలను రెట్టింపు చేశారు.
anil kumar singhal ttd business 2018 tnilive tni
*** అన్నదానంలోనూ కక్కుర్తి
ఎన్టీ రామారావు హయంలో ప్రవేశపెట్టిన టీటీడీ మహాఅన్నప్రసాదంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. మొదట్లో చక్కటి విందు భోజనంగా ఉన్న అన్నప్రసాదం క్రమేపి నాసిరకంగా మారుతోంది. బియ్యంలోనూ కక్కుర్తి పడుతున్నారు. ముతక బియ్యాన్ని వాడుతున్నారు. విస్తర్లు కూడా భారీగా రంధ్రాలు పడి నాసి రకంగా ఉంటున్నాయి. పదార్థాలు వడ్డించగానే బెజ్జాల వెంట కిందకు జారిపోతున్నాయి. విస్తర్లో అన్నం పెట్టిన వెంటనే సాంబార్ పోసేస్తున్నారు. విస్తర్లో ముందు వేసిన చట్నీ, కూర కలుపుకునే సమయం కూడా ఇవ్వడంలేదు. రుచి, వాసన లేకుండా వేసే పుల్లటి చట్నీకి పేరు ఏమిటో వడ్డించేవాడికే తెలియడం లేదు. మంచినీళ్ళ కోసం పెట్టిన స్టీల్ గ్లాసులు తుప్పు పట్టి నోటి దగర పెట్టుకోవాలంటేనే భక్తులకు భయమేస్తోంది. ఒకప్పుడు అన్నదానం చేసే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు కింద నేలంతా తడిమయంగా ఉంటోంది. అన్నదానానికి వెళ్లిన భక్తులు జారిపడతామేమోనన్న భయానికి గురవుతున్నారు. విస్తర్లను నీళ్ళతో కడగకుండానే టేబుళ్ళపై పరుస్తున్నారు. వాటిపై దుమ్మూ, ధూళి పేరుకుపోయి ఉంటుంది. తిరుమల వెళ్లి రాజభోగాలు అనుభవించే విఐపీలు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఉచిత అన్నదానం కేంద్రంలో భోజనం చేయాలని నిబంధన విధిస్తే తప్ప అన్నదాన కేంద్రంలో పరిస్థితి మెరుగుపడదు.


*** బ్రోకర్ల రాజ్యం
తిరుమల పుణ్యక్షేత్రంలో బ్రోకర్లు, దళారీల దందా యథేఛ్చగా కొనసాగుతోంది. ప్రతి మంత్రికి, సీనియర్ ప్రజాప్రతినిధులుకు కొండపైన ఒక్కొక్క ఏజెంట్ ఉన్నాడు. జేఈవో కార్యాలయంలో వీరికి అంతులేని పలుకుబడి ఉంది. వేలాది రూపాయలు బ్రోకర్లకు చెల్లిస్తే ఎటువంటి దర్శనమైనా, పద్మావతి అతిథి భవనంలో వసతినైనా ఇట్టే సమకూర్చగలిగిన దళారీలు కొండపైన కాసుకుని ఉన్నారు.


*** కళ్యాణోత్సవాన్ని నీరుగార్చారు
ఒకప్పుడు రూ.750 చిన్న కళ్యాణోత్సవాన్ని రూ.2000 రూపాయలతో, పెద్ద కళ్యాణోత్సవాన్ని భక్తుల అభీష్టం మేరకు సంతృప్తికరంగా నిర్వహించేవారు. ఇప్పుడు అందరికీ రూ.1000 తీసుకుని ఓ పెద్ద హాలులో కల్యాణోత్సవం పేరుతో చేస్తున్న కార్యక్రమం ఒక తప్పులతంతుగా మారిపోయింది. కిక్కిరిసిపోయిన హాలులో ఊపిరి ఆడని విధంగా భక్తులను కుక్కి, తూతూమంత్రంగా కల్యాణోత్సవం అయింది అనిపిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ ప్రతినిత్యం నిర్వహిస్తున్న కల్యాణోత్సవంపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుని ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా సర్వదర్శనం లాగానే మార్చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రముఖులు, పెద్దలను మాత్రం వారు కోరుకున్నంత సేపు స్వామి ఎదుట నిలబెడుతున్నారు. ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో గుడి బయట నిర్వహించే ఊంజల సేవ ఒకప్పుడు కన్నుల పండువగా నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ సేవల్లో క్రమశిక్షణ లోపించింది. ‘ఊంజల సేవ’ టికెట్ కొన్నవారు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనం అవ్వని సామాన్య భక్తులు గతంలో మహాద్వారం బయట మూలవిరాట్ ముందు నిలబడి తమ కోరికలను విన్నవించుకుని దణ్ణం పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ సౌకర్యం కూడా లేకుండా పోయింది. మూల విరాట్ ఎదురుగా మహా ద్వారం ముందు సెక్యురిటి పాయీంట్‌ను అడ్డంగా కట్టారు. దీనిని పక్కకు జరిపితే భక్తులకు బయటే ఉండి దణ్ణం పెట్టుకున్నామన్న సంతృప్తి అయినా మిగులుతుంది. ఇటీవల గర్భగుడిలో వెంకన్న దర్శనం పూర్తిగా చేసుకోలేనివారు కొంచెం గుడి బయటకి వచ్చి ఆయన తల్లి వకుళమాత ముందు నిలబడి సంతృప్తిగా చేతులు జోడించి తమ కోరికలు తీర్చమని కోరుకునేవారు. ఇటీవలనే వకుళమాత ముందుకు వెళ్ళకుండా పక్కనే ఉండి ఆమెను దర్శించే విధంగా బారికేడ్ అడ్డంగా కట్టేశారు. హుండీ వద్ద మొక్కు చెల్లించి బయటకు వచ్చి పైనున్న లక్ష్మీదేవి విగ్రహం కాళ్ళను పట్టుకుని భక్తులు వేడుకునేవారు. ఇప్పుడు అక్కడ లక్ష్మిమాతను పట్టుకోకుండా భారీ గెట్ కట్టేశారు. కొంచెం ముందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో గర్భగుడి ముందు రెండు ద్వారాల మధ్యలో భక్తులు సాష్టాంగ ప్రమాణాలు చేసేవారు. ఇప్పుడు అక్కడ దణ్ణం కూడా పెట్టుకోకుండా బారికేడ్ పెట్టి సెక్యురిటిని పెట్టారు.


*** ధ్వజస్తంభాన్ని ఎందుకు అంటుకోనివ్వరు?
తిరుమలకు ఏ ప్రముఖుడు వచ్చిన ఈవో, జేఈవో తదితర అధికారుల ధ్వజస్తంభం వద్ద వారికి రాచమర్యాదలు చేసి ఫోటోలకు ఫోజులు ఇస్తారు. వారు సాష్టాంగ నమస్కారాలు చేయటానికి వీలుగా దుప్పట్లు పరుస్తారు. సామాన్య భక్తులు మాత్రం క్యూలైన్‌లో ఉండి ధ్వజస్తంభాన్ని అంటుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ సిబ్బంది ‘కాకుల్లా’గా పొడుస్తారు. వాస్తవానికి భక్తులందరూ క్యూలైన్‌లో ఉండి ధ్వజస్తంభాన్ని బారికేడ్ బయటి నుండే ‘తాకే’ ఏర్పాట్లు చేయవచ్చు. మరి ఆవిధంగా ఎందుకు చేయరో అర్థం కాదు. గతంలో వెంకన్న దర్శనం కాకపోయినా ఆయన మాతృమూర్తినో, బయట ఉన్న ఆయన ద్వారపాలకులనో లేక సన్నిహిత దేవుళ్ళనో తాకి తృప్తిగా దణ్ణం పెట్టుకుని భక్తులు తరించేవారు. ఆ అవకాశం కూడా ప్రస్తుతం లేకుండా పోయింది. భవిష్యత్‌లో తిరుమల వెళ్ళాలంటేనే సామాన్యుడు భయపడే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. భక్తుల సౌకర్యాల గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టే విధంగా తిరుమలను వ్యాపార కేంద్రంగా మారుస్తారా? అనే అభిప్రాయం కూడా భక్తుల్లో ఏర్పడుతోంది. ఆశపడి ఒక లడ్డూనో, ఒక కళ్యాణం లడ్డునో, ఒక వడనో కొనుక్కొని ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇరుగుపొరుగు వారికి పెట్టుకుందాం అంటే ఆ ఆశలు కూడా అడుగంటుతున్నాయి. ‘తిరుమల వెళ్తున్నావు కదా నాకొక లడ్డూ తీసుకురా’ అని ఇక నుండి ఎవరికీ చెప్పలేని విధంగా పరిస్థితులు మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుమల యాత్రకు వెళ్ళిన ఏ సామాన్య భక్తుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు పరిపాలనకు శాపనార్ధాలు పెట్టకుండా ఉండడు. రాజకీయాలకు అతీతంగా వ్యాపార ధోరణలకు దూరంగా ఉండి పూర్తి ఆద్యాత్మిక కేంద్రంగానే తిరుమలను తీర్చిదిద్దినప్పుడే చంద్రబాబ్Y ఆయన ప్రభుత్వానికి లక్షలాది భక్తుల హృదయాల్లో స్థానం లభిస్తుంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్. ఈమెయిల్: kilarumuddukrishna@yahoo.com
tags: ttd tirumala tirupati devasthanams 2018 tnilivetelugu news international global abroad news telugu news world telugu news nri news nrt news indian news abroad ttd fraud ttd in scary situation anil kumar singhal jeo srinivasaraju ttd putting devotees at pain kalyanotsavam vada laddu ttd laddu

More News

One thought on “చంద్రబాబు వైఫల్యాలు-1.టీటీడీను వ్యాపారకేంద్రంగా మారుస్తున్న “ఉత్తరాధికారి”-TNI ప్రత్యేకం

  1. A. Purnima

    These comments are true. Two months back, we attended the kalyanotsavam. Tickets were sold to such an extent that devotees had to stand on the side walk areas. Sankalpam through mike announcement couldn’t be heard due to devotees roaring sounds. Kalyanam couldn’t be seen properly in direct tv relay also. The employees holding the rope at the end of the Kalyanam were harsh in their words to the devotees. The purohits were extending their hands for money while giving akshatas. Darshan was also move, move words with push and pull by the staff / sevaks. Only satisfaction was, yes we visited Tirumala and had a glimpse of the Lord. Annaprasadam – free meals – was truly as narrated in the article.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com