Movies

38ఏళ్ల బొబ్బిలిపులి

38ఏళ్ల బొబ్బిలిపులి - TNILIVE Special Movies - Bobbili Puli Completes 38 Years - Sambhavam....

బొబ్బిలిపులి (జూలై 9, 1982 , శుక్రవారం విడుదల)

సంభవం…నీకే సంభవం తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాయాలన్నా… రికార్డు బ్రేక్‌ కలెక్షన్లు సృష్టించాలన్నా…తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవాలన్నా ఒక్క నందమూరి తారక రామారావుకే సంభవం.

కేవలం ఆరువారాల గ్యాప్‌లో రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో నటించిన ఖ్యాతి ఒక్క నటరత్నకే సంభవం…9-7-1982న విడుదలెైన ‘బొబ్బిలిపులి’ 38 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘బొబ్బిలిపులి’ పై ప్రత్యేక వ్యాసం…

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ న్యాయమూర్తిగా జీవించిన చిత్రం ‘జస్టిస్‌ చౌదరి’ విడుదలెైన ఆరువారాలకే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మరో సంచలనం సృష్టించడానికి విడుదలెైన చిత్రం ‘బొబ్బిలి పులి’.

విజయమాధవి ప్రొడక్షన్స్‌ పతాకంపెై వడ్డే శోభనాద్రి నిర్మాతగా 1982 జులెై 9న సుమారు 100కు పెైగా థియేటర్లలో విడుదలెైన తొలి తెలుగు చిత్రంగా ఒక రికార్డును సృష్టించిన ఈ సినిమాకి అడ్డంకులెన్నో. విడుదల కాకముందర అనేక సెన్సార్‌ ఇబ్బందులను ఎదుర్కొని ఆఖరుకు కేంద్ర మంత్రులు కూడా ఈ సినిమాను చూసి ఎట్టకేలకు ఎటువంటి కట్స్‌ లేకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చనే అనుమతిని ఇచ్చారు. దీనికి మూడు నెలలకు పెైగానే పట్టింది. సరిగ్గా అదే సమయానికి నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీస్థాయికి రెపరెపలాడేలా చేశారు.

అప్పటి కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి పులి మీద కక్షసాధింపు చర్యగా భావించి రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్‌ అభిమానులు ‘బొబ్బిలిపులి’ చిత్రం విడుదల కోరుతూ రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించారు. అలా విడుదల కాకముందే ఈ చిత్రం మరో సంచలనం సృష్టించింది. ఇక విడుదలయ్యాక అప్పటిదాకా కేవలం రోజుకు 3 ఆటలు ప్రదర్శించే థియేటర్లు బొబ్బిలి పులి చిత్రం విడుదలయ్యాక జనం రద్దీని తట్టుకోవడానికి రోజుకు నాలుగు ఆటలూ బొబ్బిలిపులి చిత్రాన్నే ఆడించాల్సి వచ్చింది.

ఆ రోజుల్లో 38 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా మరో అరుదెైన రికార్డును సొంతం చేసుకుంది బొబ్బిలి పులి. 70 ప్రింట్లతో విడుదలెైన ఈ చిత్రం తొలి వారంరోజులకే రూ.71 లక్షలు వసూలు చేసింది. ఇవాళ కోట్లు వసూలు చేశాయంటున్న పెద్ద హీరోల సినిమా కలెక్షన్ల కన్నా ఎక్కువ రెట్ల మొత్తంలో కలెక్షన్లువసూలు చేసింది బొబ్బిలి పులి. అప్పటి లక్షలు ఈ రోజుల్లో కోట్లతో సమానం. ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కువ ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలు మూడే. అవి అడవిరాముడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి. ఈ మూడూ ఎన్‌టిఆర్‌వే కావడం విశేషం.

బొబ్బిలిమరో విశేషం ఏమిటంటే హైదరాబాద్‌లో రిపీట్న్‌గ్రా విడుదలెై మళ్లీ 175 రోజులు ప్రదర్శించబడటం. ఇక ఈ చిత్రంలో మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపించే డెైలాగులు ఉన్నాయి. ‘కోర్టు కోర్టుకు…తీర్పు తీర్పుకు ఇంత మార్పు ఉంటే…మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్‌’ అంటూ ఎన్టీఆర్‌ డెైలాగులు చెబుతుంటే కింది క్లాస్‌ నుంచి పెై క్లాస్‌ దాకా చప్పట్లతో థియేటర్లు మార్మోగిపోయాయి. ఇక దేశ సరిహద్దుల్ని కాపాడే వీరజవాన్‌గా పనిచేసిన ఎన్టీఆర్‌కు దేశం లోపల చీడపురుగుల్లాంటి కొంతమంది దేశాన్ని ఏ విధంగా దోచుకుతింటున్నారో చూసి చలించిపోయి అటువంటి వారికి తనదెైన రీతిలో బుద్ధి చెబుతాడు.

ఈ క్రమంలో బొబ్బిలి పులిగా మారి అవినీతి, లంచగొండితనంపెై తిరుగబాటు చేస్తాడు. ఈ చిత్రం కథ స్ఫూర్తితో తర్వాత భారతీయుడు, ఠాగూర్‌ వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక ఇందులోని పాటలు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటాయి.

ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు రచించిన ‘సంభవం…నీకే సంభవం’, ‘జననీ…జన్మ భూమిశ్చ’ వంటి పాటలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో పదికాలాల పాటు పాడుకునే పాటలుగా నిలిచిపోయాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్‌లో శ్రీదేవి లాయర్‌గా చక్రధర్‌ పాత్రధారి ఎన్టీఆర్‌ని అడిగే సన్నివేశంలో ఎన్టీఆర్‌ చెప్పే డెైలాగులు విని చప్పట్లు కొట్టని తెలుగువాడు ఉండడేమో

ఆ రోజుల్లో…శ్రీదేవి ‘మీరొక్కరే ఏం చేస్తారు?’ అని ఎన్‌టిఆర్‌ని అడుతుంది అప్పుడు ‘ మహాత్మాగాంధీ ఒక్కడే నడుం కడితే యావత్‌ దేశమే ఆయన వెనక వచ్చింది’, ‘అల్లూరి సీతారామరాజు ఒక్కడే విల్లు పడితే…మన్యం మన్యమే ఆయన వెంట కదిలి వచ్చింది, భగత్‌ సింగ్‌ ఒక్కడే..యావత్‌ యువశక్తి ఆయన వెంట వచ్చింది’ అంటూ రామారావు చెప్పే డెైలాగులు చప్పట్లు కొట్టించేలా చేశాయి.

జె.వి. రాఘవులు అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆక్సిజన్‌లా పనిచేసింది. వాడవాడలా రికార్డు కలెక్షన్లు సృష్టించిన చిత్రంగా నిలిచింది.