మనదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీని ప్రభావిత రంగాల్లో చిత్రపరిశ్రమ ఒకటి. కొవిడ్ 19 కారణంగా చిత్రసీమ ఇప్పటికే చాలా నష్టాల్ని ఎదుర్కొంది. షూటింగులు చేయడం చాలా కష్టంగా మారింది. దానివల్ల సినిమా ఆలస్యం కావడంతో నిర్మాతకు నష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ సినిమాలకు బీమా చేయించాలని నిర్ణయించారు నిర్మాతలు అతుల్ కాస్ బెకర్, తనూజ్ గార్గ్. ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి తాప్సి ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న చిత్రం ‘లూప్ లపేటా’. ప్రమాద బీమా లాంటిదే ఈ కొవిడ్ బీమా కూడా అని చెబుతున్నారు అతుల్. ‘‘చిత్రబృందంలో ఎవరికైనా కొవిడ్ 19 పాజిటివ్ వస్తే మిగిలిన అందరూ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందే. దాంతో చిత్రీకరణ వాయిదా పడుతుంది. కొవిడ్ బీమా చేయించడం వలన చిత్రీకరణ చేయలేని రోజులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు’’అని చెబుతున్నారు అతుల్. ప్రస్తుతానికి ‘లూప్ లపేటా’ బీమాకు సంబంధించిన డ్రాప్ట్ వర్క్ జరుగుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే కొవిడ్ బీమా పొందిన తొలి చిత్రంగా ‘లూప్ లపేటా’ నిలుస్తుందంటున్నాయి చిత్రవర్గాలు.
సినిమాకు కరోనా ఇన్స్యూరెన్స్
Related tags :