NRI-NRT

సింగపూర్ ఎన్నికల్లో PAP విజయం

సింగపూర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ అధికార పార్టీకే పట్టంకట్టారు. అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) 61.2 శాతం ఓట్లతో పార్లమెంటులోని 83 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష వర్కర్స్‌ పార్టీ మొదటి సారిగా రెండంకెల సీట్లను గెలుపొందింది. పార్లమెంటులోని మొత్తం 93 స్థానాల్లో వర్కర్స్‌ పార్టీ 10 స్థానాలను సొంతం చేసుకుంది. కాగా, అధికార పార్టీకి 2015లో 71 శాతం ఓట్లు రాగా, ఈ సారి మాత్రం 10 శాతం ఓట్లు తగ్గాయి. అయితే ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఎన్నికలు జరగడంతో ప్రజలు వీటిని రెఫరెండంలానే భావించారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో 2.65 మిలియన్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార పీఏపీ దేశంలో 1959 నుంచి అధికారంలో కొనసాగుతున్నది. సింగపూర్‌ పితామహుడిగా పిలుచుకునే లీ కువాన్‌ యూ దేశ ప్రధానిగా 1990 వరకు కొనసాగారు. ప్రస్తుత ప్రధాని లీ సీన్‌ లూన్‌ 2004 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ఆయన ప్రకటించారు. కాగా, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ ఎన్నికలు జరిగిన దేశాల్లో అతిచిన్న దేశంగా సింగపూర్‌ నిలిచింది. ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో, జూన్‌లో సెర్బియాలో ఎన్నికలు జరిగాయి. ఈ ఆసియా పసిఫిక్‌ దేశంలో ఇప్పటివరకు 45 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.