* భారత్-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే.. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై ఇటీవల పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరింత ముదిరితే.. అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు అండగా ఉంటారన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. జపాన్, భారత్ వంటి పొరుగు దేశాలతో చైనా గిల్లీకజ్జాలు పెట్టుకుంటోదని డ్రాగన్ దుశ్చర్యలను ఎండగట్టారు. తాజాగా వియాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* దేశవ్యాప్తంగా గత వందేళ్లలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్బీఐ అన్ని రకాల చర్యలు తీసుకుందని వివరించారు.ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధి రేటుతో పాటు ఆర్థిక స్థిరత్వంపై ఆర్బీఐ దృష్టి సారించిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత, తిరిగి కోలుకోగలిగే శక్తికి కరోనా సంక్షోభం పరీక్షగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు ఆర్బీఐ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు గుర్తుచేశారు. మార్కెట్లో విశ్వాసం నింపేందుకు ద్రవ్య లభ్యత పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో కర్ణాటక బ్యాంక్ అత్యధిక త్రైమాసిక లాభం రూ.196.38 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.175.42 కోట్లుగా ఉంది. వ్యయ నియంత్రణ చర్యలు, వడ్డీ ఆదాయం పెరగడం ఇందుకు దోహదపడిందని కర్ణాటక బ్యాంక్ తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.1,794.33 కోట్ల నుంచి రూ.2,134.63 కోట్లకు చేరింది. ఇక నిర్వహణ లాభం రూ.350.01 కోట్ల నుంచి 93.43 శాతం పెరిగి రూ.677.04 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.494.59 కోట్ల నుంచి 8.19 శాతం వృద్ధి చెంది రూ.535.12 కోట్లకు పెరిగింది. ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 4.55 శాతం నుంచి 4.64 శాతానికి చేరాయి. ఇక నికర ఎన్పీఏలు 3.33 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే.. స్థూల ఎన్పీఏలు రూ.2,437.53 కోట్ల నుంచి రూ.2,557.64 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ.1,759.77 కోట్ల నుంచి రూ.1,630.65 కోట్లకు చేరాయి. మొండి బకాయిలపై కేటాయింపులు రూ.201.14 కోట్ల నుంచి రూ.509.07 కోట్లకు రెట్టింపయ్యాయి. నికర వడ్డీ మార్జిను 2.81 శాతం నుంచి 2.89 శాతానికి మెరుగుపడింది. బిజినెస్ టర్నోవర్ 2.89 శాతం వృద్ధి చెంది రూ.1.26 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో షేరు 3.52 శాతం పెరిగి రూ.47.10 వద్ద ముగిసింది.
* మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ రూ.92.86 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మొండి బకాయిల సెగతో పది త్రైమాసికాల పాటు నష్టాలు నమోదు చేసిన బ్యాంక్.. ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. 2018-19 జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ రూ.264.43 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.739.73 కోట్ల నుంచి రూ.629.76 కోట్లకు పరిమితమైంది. ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 15.30 శాతం నుంచి 25.69 శాతానికి చేరాయి. విలువ పరంగా స్థూల ఎన్పీఏలు రూ.3,358.99 కోట్ల నుంచి రూ.4,233.31 కోట్లకు పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు 10.04 శాతం (రూ.1387.86 కోట్లు) నుంచి 7.49 శాతానికి (రూ.1506.29 కోట్లు) తగ్గాయి. మొత్తం కేటాయింపులు మాత్రం రూ.478.77 కోట్ల నుంచి రూ.303.47 కోట్లకు చేరాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం చూస్తే.. 2018-19లో నష్టం రూ.894.09 కోట్లుగా నమోదుకాగా, 2019-20లో రూ.836.04 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.3090.21 కోట్ల నుంచి రూ.2558.03 కోట్లకు చేరింది. బీఎస్ఈలో షేరు 2.19 శాతం తగ్గి రూ.22.35 వద్ద ముగిసింది.
* ఆన్లైన్ ఆహార సేవల సంస్థ జొమాటో ఆదాయం గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రెండింతలు పెరిగి 394 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2960 కోట్లు)గా నమోదైంది. ఇక ఎబిటా దాదాపు రూ.2,200 కోట్లుగా ఉంది. 2018-19లో కంపెనీ ఆదాయం దాదాపు రూ.1440 కోట్లుగా, ఎబిటా రూ.2080 కోట్లు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని, ఈ దిశగా మంచి పురోగతి సాధించామని జొమాటో వెల్లడించింది. కొవిడ్-19 వల్ల కంపెనీ వ్యాపార పరిమాణం తగ్గినప్పటికీ.. లాభాల్లోకి నడిచామని తెలిపింది. ఖర్చులపై నియంత్రణ కొనసాగిస్తూ వచ్చే 3-6 నెలల్లో పూర్తిగా కోలుకుంటామని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. 2019-20లో భారత ఆహార డెలివరీ స్థూల వ్యాపార విలువ 1496 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,250 కోట్లు)కు పెరిగింది. 2018-19లో ఇది 718 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5395 కోట్లు)గా ఉంది.
* తమది రెండు గ్రూపుల కంపెనీ కాదని, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాక్షిక భాగస్వామ్య ఒప్పందం కూడా లేదని సుప్రీంకోర్టుకు టాటా సన్స్ ప్రైవేటు లిమిటెడ్ (టీఎస్పీఎల్) స్పష్టం చేసింది. టీఎస్పీఎల్ బోర్డులో తమ కుటుంబానికి ఉన్న వాటాకు అనుగుణంగా టీఎస్పీఎల్ బోర్డులో ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సైరస్ మిస్త్రీ వేసిన పిటిషన్లో చేసిన ఆరోపణలను తొలగించాలని టాటాసన్స్ విజ్ఞప్తి చేసింది. ‘వాస్తవాలు పరిశీలిస్తే, టాటాసన్స్ ఎప్పుడూ కూడా రెండు గ్రూపుల సంస్థ కాదు. సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో భాగస్వామ్య ఒప్పందమూ లేదు. అందువల్లే టాటా గ్రూప్ మాత్రమే అయ్యింది’ అని అఫిడవిట్లో పేర్కొంది. టాటాసన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నిర్మిస్తూ, 2019 డిసెంబరు 18న ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలపై ఈ ఏడాది జనవరి 10న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి విదితమే. అయితే సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన క్రాస్ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డె నేతృత్వంలోని బెంచ్ మే 29న టీఎస్పీఎల్తో పాటు ఇతరులకు నోటీసు జారీ చేసింది. సైరస్ మిస్త్రీ కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2012 డిసెంబరులో గ్రూప్ బాధ్యతల నుంచి వైదొలగిన తరవాత టాటా సన్స్ భరించిన వ్యయాలన్నింటినీ రతన్ టాటా తిరిగి చెల్లించాలని, అంతర్జాతీయంగా పాటిస్తున్న అత్యున్నత పాలనా ప్రమాణాలను అనుసరించి ఇలా చేయాలని సైరస్ కోరారు. తన పనితీరును తక్కువగా చూపేందుకు టీసీఎస్ డివిడెండ్లను పరిగణనలోకి తీసుకోవద్దని టాటాలు కోరుతున్నారని, అదేవిధంగా టీసీఎస్ లాభాలను మినహాయిస్తే 2019లో టాటా గ్రూప్‌నకు రూ.13,000 కోట్ల సవరించిన నికర నష్టాలు వచ్చాయని, 3 దశాబ్దాలలో ఇవే అత్యంత అధిక నష్టాలుగా సైరస్ పేర్కొన్నారు. తన కుటుంబానికి ఉన్న 18.37 శాతం వాటాకు అనుగుణంగా కంపెనీలో తనకు ప్రాతినిథ్యం ఉండాలని, టాటాసన్స్ ఛైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మిస్త్రీ కోరుతున్నారు. మిస్త్రీ చెబుతున్నట్లు ఆ సంస్థతో పాక్షిక భాగస్వామ్య ఒప్పందం లేదని, ఎన్సీఎల్టీ ఎదుట ఆయన ఎప్పుడూ ఇలా చెప్పలేదని టాటా సన్స్ పేర్కొంది. ఎన్సీఎల్ఏటీకి కేసు చేరాకే ఈ వాదన వినిపిస్తున్నారని వివరించారు. ఎన్సీఎల్ఏటీ కూడా టాటా సన్స్‌ను పాక్షిక భాగస్వామ్యం గురించి ఏమీ ప్రశ్నించకుండానే, మిస్త్రీకి అనుకూలంగా ఆదేశాలిచ్చిందన్నారు.