DailyDose

ఇండియాలో గూగుల్ ₹75వేల కోట్ల పెట్టుబడి-వాణిజ్యం

ఇండియాలో గూగుల్ ₹75వేల కోట్ల పెట్టుబడి-వాణిజ్యం

* సెర్చ్ ఇంజన్ ‘గూగుల్‌’ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘డిజిటైజేషన్‌ ఫండ్‌’ కింద ₹75,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్ పిచయ్‌ వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సుందర్‌ పిచయ్‌తో మాట్లాడారు.

* దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ నోట్‌20 సిరీస్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఆగస్టు 5వ తేదీన దీనిని విపణిలోకి తీసుకురానుంది. దీనికోసం వర్చువల్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫోన్‌ ధర కూడా గెలాక్సీ నోట్‌10తో పోలిస్తే చౌకగా ఉండే అవకాశాలున్నాయి.

* ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) షాకిచ్చింది. అధిక డేటా స్పీడు అందిస్తామంటూ తీసుకొచ్చిన రెండు ప్లాన్లను నిలిపివేయాలని ఆ రెండు సంస్థలను ఆదేశించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని లేఖలు రాసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. రెయిన్‌ ఇండస్ట్రీస్‌, థైరోకేర్‌, బీఏఎస్‌ఎఫ్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌, హథ్‌వేకేబుల్‌ లాభాల్లో.. యస్‌బ్యాంక్‌, శంకర బిల్డింగ్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్‌ వంటివి భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా రిలయన్స్‌ షేర్లను భారీగా కొనుగోలు చేయడం, ఐటీ, లోహరంగాల షేర్లు లాభాల్లో ఉండటం సూచీలకు కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ సుమారు 3శాతం విలువ పెరిగింది. ఇక టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు లాభపడటంతో సూచీలు ముందుకెళ్లాయి. ఆసియ మార్కెట్లలో జపాన్‌ సూచీలు, చైనా, ద.కొరియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

* కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో జాప్యం జరిగే కొద్దీ భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా పేర్కొంది. అన్నీ అనుకున్నట్లు సాగితే భారత్‌ జీడీపీ వృద్ధిరేటు -4గా రావచ్చని పేర్కొంది. అదే సమయంలో టీకా ఆలస్యమైతే మాత్రం జీడీపీ వృద్ధిరేటు -7.5శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ విభాగంలోని ఆర్థికశాస్త్రవేత్తలు ఈ మేరకు అంచనాల్లో సర్దుబాట్లు చేశారు.
ఇప్పటికే కొవిడ్‌కు టీకాను కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నా.. అవి ఎప్పటిలోగా మార్కెట్లోకి వస్తాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. జాతీయ స్థాయి లాక్‌డౌన్‌లు, కఠిన నిబంధనల కారణంగా జీడీపీ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం పడిందంటున్నారు. ‘‘ప్రపంచ టీకా కోసం మరో సంవత్సరం ఎదురు చూడాల్సి వస్తే మాత్రం భారత జీడీపీ -7.5శాతం పతనం అవ్వవచ్చు. మరీ ప్రతికూల వాతావరణంలో మాత్రమే ఇలా జరగొచ్చు’’ అని వారు తెలిపారు. ప్రతి నెల లాక్‌డౌన్‌ జీడీపీలో ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కొవడానికి ఆర్‌బీఐ మరో 2శాతం వరకు వడ్డీరేట్లలో కోత విధించవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నిపుణులు చెప్పారు.

* నౌకాశ్రయాల ఆధారంగా పరిశ్రమల స్థాపనను ఇతోధికం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని ప్రధానమైన 12 నౌకాశ్రయాలకు అనుబంధంగా 1.10 లక్షల హెక్టార్ల భూమిని ఇందుకు కేటాయించిందని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మందవీయ తెలిపారు. ఏయే పరిశ్రమలను ఈ భూముల్లో నెలకొల్పితే బాగుంటుందనే విషయమై అంచనాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, కాండ్లా, ముంబయి, జేఎన్‌పీటీ, మార్ముగోవా, న్యూమంగళూర్‌, కోచి, చెన్నై, కామరాజార్‌ (ఎన్నోర్‌), వీఓ చిదంబరనర్‌, పారాదీప్‌, కోల్‌కతా (హల్దియా సహా) నౌకాశ్రయాల సమీపాలన ఈ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక.