రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 17న లడక్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.
భద్రతా సమీక్ష నిమిత్తం రాజ్‌నాథ్ సింగ్ లడక్‌ను సందర్శించనున్నారు.
పర్యటనలో భాగంగా రక్షణమంతి ఈ 18వ తేదీన జమ్ముకశ్మీర్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాలను సందర్శిస్తారు.
పర్యటనలో రక్షణశాఖ మంత్రి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం. నారవాణే ఉంటారు.
జులై ఆరంభంలో రాజ్‌నాథ్ సింగ్ లడక్‌ను సందర్శిస్తారని భావించినప్పటికీ పర్యటన వాయిదా పడింది.
జులై 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకస్మాత్తుగా లడక్ ను సందర్శించారు.
ప్రధాని పర్యటన అనంతరం రెండు వారాల తర్వాత రాజ్‌నాథ్ లడక్ సందర్శనకు వెళ్తున్నారు.
గాల్వన్ లోయ ఘటనతో భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు ఇరువైపుల నుండి సీనియర్ సైనిక కమాండర్లు చర్చలు జరుపుతున్నారు.
మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగాయి.
పాంగోంగ్ త్సో అదేవిధంగా డెప్సాంగ్ మైదానాలకు సమీపంలో ఉన్న ఫింగర్ ఏరియాలోని రెండు సైన్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు ఇతర రంగాలలోని ఘర్షణ పాయింట్ల నుండి ఆయుధాలు, సామగ్రిని వెనక్కి తీసుకురావడంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లుగా సమాచారం.