Fashion

దేవతలకు ప్రీతి…దసిలి పట్టు

దేవతలకు ప్రీతి…దసిలి పట్టు

వందల యేండ్ల చరిత్ర కలిగిన పట్టు.. దేవతలకు మాత్రమే పరిమితమైన పట్టు.. ఇప్పుడు మగువల మనసులనూ కనికట్టు చేస్తున్నది. గోదావరి తీరం వెంట పుట్టిన ఈ పట్టు.. ఫ్యాషన్‌ ప్రపంచాన్నీ ఓ పట్టు పడుతున్నది. కాస్తంత ప్రోత్సాహం తోడైతే దసలిపట్టు తెలంగాణ వస్త్రరాజంగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం.
*దసలి పట్టు ముదురు గోధుమ బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. దీంతో, వందల ఏండ్ల నుంచీ సామాన్యులెవరూ ఆ పట్టును ధరించే సాహసం చేయలేదు. దేవుళ్ళకే సమర్పించేవారు. ఈ దేవతా వస్ర్తాలను నేసేవారిని దేవాంగులు అంటారు. కాళేశ్వరంలో ఏటా శివరాత్రికి నిర్వహించే కళ్యాణానికి దసలిపట్టు వస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీ. ఆ తర్వాత కాలంలో, మహదేవపూర్‌ ప్రాంతంలోని కలపకు గిరాకీ పెరిగింది. దీంతో కలప వర్తకులు ఓసారి, నిజాం నవాబుకు దసలి పట్టుతో నేసిన వస్ర్తాలను కానుకగా సమర్పించారు. ఇవి నిజాంకు చాలా నచ్చాయి. దీంతో, ఇక్కడి నుంచే ప్రత్యేకంగా పట్టు వస్ర్తాలను తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లో నిజాం స్థానిక నేత కార్మికులకు సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు.
**అదో గొప్ప గౌరవం! పదేండ్ల నుంచీ..
అప్పటివరకూ పరమాత్మకూ, ప్రభువులకూ మాత్రమే పరిమితమైన దసలి పట్టు (టస్సర్‌ పట్టు), ఓ దశాబ్దం నుంచీ కొత్త హంగులు అద్దుకొంటున్నది. సామాన్యులనూ మురిపిస్తున్నది. వందల ఏండ్ల పాటు ఏనాడూ వ్యాపార వస్తువుగా పరిగణించలేదు. కాబట్టే, ఇప్పటికీ నిఖార్సయిన పట్టుతోనే వస్ర్తాలను నేస్తారు. గత పదేండ్ల నుంచీ దసలి పట్టును వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. ఆ చీరలు ఆలయాల్ని దాటి వస్ర్తాలయాల్లోకి ప్రవేశించాయి. పట్టు పురుగుల పేరుతోనే ఈ పట్టుకు ఆ పేరు స్థిరపడింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ర్టాలతో పాటు తెలంగాణలో గోదావరి తీరం వెంట చెన్నూర్‌, మహదేవపూర్‌, ఏటూరునాగారం అడవుల్లో ఈ పట్టు పురుగులు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా మద్ది ఆకులపై ఆవాసం చేస్తాయి. అందువల్ల పొలాల్లో కాకుండా, సహజసిద్ధ వాతావరణంలో.. అదీ, అడవుల్లోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పట్టుపురుగులను పెంచుతారు. వర్షాకాలం ఆరంభం తర్వాత, జూన్‌లో మొదటి పంటను ప్రారంభిస్తారు. మద్ది ఆకులపై వంద గ్రాముల గుడ్లను ఉంచుతారు. వారం రోజుల వ్యవధిలో గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. వీటిని 35 రోజుల పాటు కాపాడితే పట్టు గుళ్ళు సిద్ధం అవుతాయి. ఆ తర్వాత, నేత పనిని దేవాంగులు చేపడతారు.
**పుంజుకుంటే..
కారణాలు ఏమైతేనేం, క్రమంగా దసలి పట్టు వైభవాన్ని కోల్పోయింది. ఈ వస్ర్తాల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. ఉపాధిలేని దేవాంగులు తిండి, బట్టలకు ఇబ్బందులు పడ్డారు. దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో, ఇక్కడ పట్టు రీసెర్చ్‌ సెంటర్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత దేవాంగ కార్మికులకు సబ్సిడీపై పట్టు అందివ్వాలని, రుణాలు మంజూరు చేయాలని.. సర్కారు నిర్ణయించడంతో కొంతమేర పరిశ్రమ పుంజుకుంది. దసలి పట్టు వస్ర్తాలకు ఏ వర్ణాలూ అద్దరు. దీంతో అన్నీ ఒకే రంగులో ఉంటాయి. పట్టులో నాణ్యత ఉన్నా, విభిన్నమైన రంగులు లేకపోవడంతో చాలాకాలం కొత్త డిజైన్లు రాలేదు. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నమూ మొదలైంది. ఈ పట్టుకు రంగులు అద్దడం ఎలాగో నేర్పించడానికి.. ప్రభుత్వం దేవాంగ నేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రయత్నాలు ఫలించి దసలి పట్టు వర్ణ సమ్మేళనంగా మారింది. ఇంకేముంది, మగువలు పోటీపడి కొంటున్నారు.
**మరింత అందంగా..
రసాయన రంగుల ప్రవేశంతో, వస్ర్తాల పరిధి విస్తరించింది. వినియోగం కూడా పెరిగింది. ఫ్యాషన్‌ డిజైనర్లు టస్సర్‌ సిల్క్‌ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. లాంగ్‌ గౌన్లు , లెహంగాలకి కూడా వాడుకోవచ్చు. ఇక చీరల మీదికి, మగ్గం వర్క్‌ చేసిన బ్లౌజులతో మరింత అందం చేకూరుతుంది.
**ఆరున్నర మీటర్లతో..
దేవతలకు సమర్పించే వస్ర్తాలతోపాటు, సామాన్యులు కట్టుకునే చీరలకూ; పంచెలకూ ఆదరణ పెరగడంతో.. మెల్లమెల్లగా దసలి పట్టుకు గిరాకీ అధికమైంది. మిగిలిన పట్టు చీరలతో పోలిస్తే. ఈ పట్టులో నాణ్యత ఎక్కువ. ఒకసారి చుట్టుకోగానే తనివి తీరదు. మళ్లీమళ్లీ కట్టుకోవాలనిపిస్తుంది. అందుకే, మళ్లీమళ్లీ కొంటున్నారు. చీర పొడవు ఆరున్నర మీటర్లు. మగ్గం మీద నేసే దసలి పట్టుచీరలో అధికంగా పట్టు వాడుతారు. దీంతో ధర కాస్త ఎక్కువే. ఆరున్నర మీటర్లు ఉండే పట్టు చీర ధర నాలుగు వేల నుంచి మొదలవుతుంది. గోల్కొండ షోరూంలలోనూ దసలి పట్టుకు మంచి గిరాకీ ఉంది. వీఐపీలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. హుందాగా కనిపించడానికి ఈ పట్టు బట్టల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.