Sports

ఆన్‌లైన్ చదరంగం మజా ఇవ్వట్లేదు

ఆన్‌లైన్ చదరంగం మజా ఇవ్వట్లేదు

బోర్డు మీద ఎదురెదురుగా కూర్చొని తలపడే చదరంగానికి ఆన్‌లైన్‌ చెస్‌ ప్రత్యామ్నాయం కాబోదని భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తెలిపింది. చెస్‌లో ముఖాముఖి తలపడితేనే మజా ఉంటుందని చెప్పింది. అదే అసలైన ఆట అని పేర్కొంది. “ఇంట్లో ఊరికే కూర్చోవడం బదులు ఆన్‌లైన్‌ చెస్‌తో బిజీగా ఉంటున్నాం. అయితే ముఖాముఖి చదరంగానికి ఆన్‌లైన్‌ చెస్‌కు చాలా తేడా ఉంది. బోర్డు మీద ఆడే చెస్‌ పూర్తిగా భిన్నం. చేతులతో పావులు కదుపుతూ.. ప్రత్యర్థి కళ్లలోకి చూస్తూ.. ఆత్మవిశ్వాసం లేదా భయాన్ని గమనిస్తూ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తునప్పుడు కలిగే భావోద్వేగాలు ఆన్‌లైన్‌ చెస్‌లో ఉండవు. ఆన్‌లైన్‌ ఆట మౌజ్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎంత వేగంగా మౌజ్‌ కదిలిస్తే వారే ముందుంటారు. వేగంగా ఎత్తులు వేసే క్రమంలో తప్పులు దొర్లినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ముఖాముఖి ఆటకు ఆన్‌లైన్‌ చెస్‌ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదు.” అని పేర్కొంది హారిక.