DailyDose

వచ్చే నెల ప్రజలకు అందుబాటులోకి రష్యా టీకా-తాజావార్తలు

Breaking News - Russian COVID19 Vaccine To Be Released Next Month

* ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టడానికి రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తునట్టు రష్యా ఆరోగ్యశాఖామంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగష్టు మూడో తేది నుంచి రష్యా, సౌదీ ఆరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ టీకా మూడో దశ క్రినికల్‌ ట్రైల్స్‌ వేలాదిమందిపై నిర్వహించనున్నారు. సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. సెచినోవ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి రష్యన్‌ శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్టు తెలిపారు. ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్ నిలువనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మూడుకోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. మరో పదిహేడు కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. వ్యాక్సిన్‌ తయారీకి అయిదు దేశాలు అంగీకారం తెలిపినట్టు రష్యా వెల్లడించింది.

* కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రపంచమంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో వ్యాక్సిన్లపై ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ ఎడిటర్‌ పెట్టిన ఓ ట్వీట్‌ తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే వ్యాక్సిన్‌ రేసులో ముందున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా అధ్యయన ఫలితాలను ప్రకటించబోతున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో వైద్యరంగంతోపాటు సామాన్యుల్లోనూ ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

* తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్‌ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కు.. మృతుల సంఖ్య 422కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 11,530 ఉండగా.. 34,323 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 510 కేసులు.. రంగారెడ్డిలో 106 కేసులు, మేడ్చల్‌లో 76 కేసులు వచ్చాయి. ఒక్క రోజులో 11,003 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు 2,65,219 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంపై అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాటవేత ధోరణి అవలంబించారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ‘‘విజయంపై ధీమా ఉన్నారా’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘చూడాల్సి ఉంది’’ అని బదులిచ్చారు. విజయం సాధిస్తాననిగానీ, సాధించలేననిగానీ ఇప్పుడే చెప్పనని వ్యాఖ్యానించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ట్రంప్ ఇదే వైఖరి అనుసరించడం గమనార్హం. కరోనా కట్టడిలో వైఫల్యం, జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆందోళనలు, వలస విధానంలో మార్పుల వంటి పరిణామాల నేపథ్యంలో.. ప్రత్యర్థి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ట్రంప్‌ కంటే ముందున్నారని ఇటీవల పలు సర్వేల్లో తేలింది. అయితే, అవన్నీ నకిలీ సర్వేలంటూ ట్రంప్‌ వాటిని కొట్టిపారేశారు.

* అయోధ్యలో రామమందిరం భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిరం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌కు కూడా రామమందిరం పూజారులు ఆహ్వానం పంపారు. కాగా దాదాపు 300 మందికి ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ తీవ్రత యూరప్‌ దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలో రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం రికార్డుస్థాయి కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,59,848 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకు ముందురోజు కూడా 2,37,743 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం అమెరికాలోనే 24గంటల్లో 71,484 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, బ్రెజిల్‌లో 45,000, దక్షిణాఫ్రికాలో 13వేల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదించింది. భారత్‌లో నిన్న ఒక్కరోజే దాదాపు 39,000 కేసులు బయటపడ్డాయి.

* తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

* ఈ నెలఖరుకల్లా బీసీ కమిషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. బీసీ కార్పోరేషన్‌ అధికారులతో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. లంచం వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని సీఎం అన్నారు. కొత్తవాటితో కలుపుకొని మొత్తం 52 కార్పోరేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

* దిశ చట్టానికి దిక్కులేకుండా చేశారు: చంద్రబాబుదిశ చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంది.. కానీ అమలులో చట్టానికి దిక్కు లేకుండా చేశారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. పోలీసులనే సవాల్‌ చేశారంటే నేరగాళ్లు ఎంత పేట్రేగిపోతున్నారో చూడండన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత ప్రభుత్వానికి లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

* తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఇవాళ విచారణ చేపట్టింది.ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నందున కూల్చివేత జోలికి వెళ్లలేమని స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని రేవంత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై అధ్యయనానికి కేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, తెలంగాణ పీసీబీ, ఐఐటీ హైదరాబాద్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.

* భారత్‌లో కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ…మరణాల శాతం తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేసులు-మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) గత ఐదు నెలల్లో తొలిసారిగా 2.5 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జులై 18 నాటికి సీఎఫ్‌ఆర్‌ 3.41 శాతంగా ఉంది.

* రాజస్థాన్‌లో ప్రభుత్వం ఇటీవల సంక్షోభంలో పడి.. కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ మరోసారి సచిన్‌ పైలట్‌పై విమర్శలు చేశారు. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘భాజపా మద్దతుతో సచిన్‌ పైలట్‌ ఆరు నెలలుగా కుట్ర పన్నుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరగుతోందని చెబితే ఎవరూ నన్ను నమ్మలేదు. అమాయకంగా కనిపించే వ్యక్తి ఈ విధంగా చేస్తారని ఎవరూ అనుకోరు’’అని గహ్లోత్‌ తెలిపారు.