ఈ కాలంలో ముఖం ఒక్కోసారి జిడ్డు కారుతుంది. కొన్నిసార్లు పొడిబారిపోతుంది. నిజానికి ఈ రెండూ ఇబ్బంది పెట్టే సమస్యలే. వీటిని పెరుగుతో దూరం చేయొచ్చు. అదెలాగంటే…
జిడ్డుపోవాలంటే: బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని టేబుల్‌స్పూన్ పెరుగు వేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
స్క్రబర్: అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల సెనగపిండి, టొమాటో రసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించిన ఐదు నిమిషాలు తర్వాత సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఆ తర్వాత చన్నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
మచ్చలు పోవడానికి: కొంచెం పెరుగులో టీస్పూన్ పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి.
మెరవాలంటే: రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మొటిమలు మాయం: అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం మీదుండే చిన్న చిన్న మొటిమలు మాయమవుతాయి.