ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, అనంతరం తెలంగాణకు ఆరు దశాబ్దాలకు పైగా పాలనా కేంద్రమైన భవన సముదాయం కాలగర్భంలో కలిసిపోయింది. పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు చాలావరకు పూర్తయ్యాయి. కొత్త రాష్ట్రానికి సరికొత్త సచివాలయ సముదాయాన్ని నిర్మించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో పాత భవనాల కూల్చివేత పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో వ్యాజ్యం నేపథ్యంలో వారం రోజుల పాటు పనులు నిలిచిపోయి… తర్వాత మళ్లీ మొదలయ్యాయి. కూల్చివేత పనుల పరిశీలనకు మీడియాను అనుమతించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సచివాలయ భవనం కూల్చివేతను కవర్ చేయడానికి మీడియాను అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించిందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో నగర పోలీసుల పర్యవేక్షణలో సోమవారం సాయంత్రం సచివాలయంలోకి మీడియాను ప్రభుత్వం తీసుకెళ్లింది. అందులో సింహభాగం భవనాలు నేలమట్టమయ్యాయి. రెండు బ్లాకుల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
*** యుద్ధప్రాతిపదికన పనులు
సచివాలయ భవనం కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆధునిక యంత్రాలు భవనాలను నేలమట్టం చేసే పనిలో ఉన్నాయి. వందల సంఖ్యలో కార్మికులు నిర్మాణ శిథిలాల తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆ వ్యర్థాల నుంచి ఇనుప రాడ్లు, విద్యుత్తు సామగ్రి, తలుపులు తదితరాలను వేరుచేస్తున్నారు. శ్లాబులు వేసేందుకు వినియోగించిన లావుపాటి ఇనుప రాడ్లను పునర్వినియోగానికి వీలుగా వివిధ సైజుల్లో కోస్తున్నారు. పదుల సంఖ్యలో లారీల ద్వారా నిర్మాణ వ్యర్థాలను పునర్వినియోగం కోసం నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే అధికశాతం వ్యర్థాలను సచివాలయ ప్రాంగణం నుంచి తరలించినప్పటికీ ఇంకా అక్కడ ఉన్నాయి.
*** మిగిలింది రెండు బ్లాకులే…
సచివాలయం ప్రాంగణంలో ఉన్న 11 బ్లాకులకుగాను సోమవారం సాయంత్రానికి కేవలం రెండు బ్లాకులు మాత్రమే మిగిలాయి. ఆ రెండింటి కూల్చివేత పనులూ వేగంగా సాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం మధ్యాహ్నానికి ఆ రెండు బ్లాకులూ నేలమట్టమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జే, ఎల్ బ్లాకులు జీ+7 అంతస్తులుగా ఉన్నాయి. సచివాలయంలో అన్ని భవనాలు 9.87 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నాయి. ఈ రెండు బ్లాకులు కలిపి 3.36 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నాయి. మరో 6.51 లక్షల చదరపు అడుగుల మేరకు నిర్మాణాలను కూల్చివేశారు. ఆంధ్రాబ్యాంకు, పోస్టాఫీసు, ఏటీఎంల కూల్చివేత పనులూ పూర్తయ్యాయి. నిర్మాణ వ్యర్థాల నుంచి దుమ్ము పైకి లేవకుండా ఆధునిక యంత్రాల సాయంతో నీటిని వెదజలుతున్నారు.
*** ‘సర్వహిత’ వరకే మీడియా అనుమతి
కూల్చివేత పనులను చూసేందుకు మీడియాను ప్రభుత్వం మునుపటి సర్వహిత బ్లాకు వరకు మాత్రమే అనుమతించింది. వంతులవారీగా ప్రతినిధులను వాహనాల్లోంచి కిందకు దింపి పోలీసు రోప్ పార్టీ సాయంతో ఫొటోలు, వీడియో చిత్రీకరణకు అనుమతించారు. సర్వహిత బ్లాకు దాటి ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పహారా ఏర్పాటు చేశారు. పోలీసులు మినహా ఎవరూ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీడియాను మినీ బస్సుల్లో, టాపు లేని జీపుల్లో సచివాలయానికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో పోలీసు పహారాలో మీడియాను సచివాలయంలోకి తీసుకెళ్లి 30 నిమిషాల వ్యవధిలో వెనక్కి తీసుకువచ్చారు.
*** 90 శాతం పనులు పూర్తి: మంత్రి వేముల
సచివాలయ పాత భవనాల తొలగింపు పనులు సోమవారం నాటికి 90 శాతం పూర్తయినట్లు రహదారులు-భవనాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘సుమారు 4,500 లారీల వరకు నిర్మాణ వ్యర్థాలు వస్తాయని అంచనా వేశాం. ఇప్పటికే సుమారు 2 వేల లారీల వ్యర్థాలను ఆ ప్రాంగణం నుంచి తొలగించాం. మిగిలిన పనులూ త్వరలో పూర్తవుతాయి. బహుళ అంతస్తుల భవనాలు కావటంతో కూల్చివేతల సందర్భంగా ప్రమాదానికి అవకాశం ఉంటుందన్న ముందుజాగ్రత్తలో భాగంగా మీడియాను ఆ ప్రాంగణానికి అనుమతించలేదు’ అని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కూల్చివేత అంశాలను కవర్ చేసేందుకు అనుమతించాలని మీడియా నుంచి పదేపదే వినతులు వస్తుండటంతో ఎలాంటి ప్రమాదానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే ప్రాంగణానికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.