కరోనా రోగుల్ని కచ్చితంగా గుర్తించాలంటే ఇప్పటివరకూ ఉన్న ఏకైక మార్గం టెస్టులు..! అయితే ఆర్మీ కుక్కలు మాత్రం ఈ టెస్టులకు సమానమైన కచ్చితత్వంతో కరోనా బారిన పడ్డవారిని పట్టిస్తున్నాయి. జర్మనీకి చెందిన యూనివర్శటీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ జరిపిన అధ్యయనంలో ఈ శునకాల సామర్థ్యం బయటపడింది.
ఆర్మీకి చెందిన ఎనిమిది కుక్కలకు శాస్త్రవేత్తలు ముందుగా తర్ఫీదు ఇచ్చారు. ఆ తరువాత దాదాపు వెయ్యి మంది నుంచి సేకరించిన లాలా జలం శాంపిళ్లను వాటి ముందు ఉంచారు. కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లు కూడా వీటిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్మీ శునకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. కరోనా రోగుల నమూనాలను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించాయి.
వివిధ రకాల వాసనలను పసిగట్టే శక్తి మనుషుల్లో కంటే కుక్కల్లో వెయ్యి రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. కరోనా రోగుల్లోని జీవ క్రియలు ఆరోగ్యవంతుల కంటే భిన్నంగా ఉంటాయని ఈ తేడాలను కుక్కులు వాసన ద్వారా సులువుగా గుర్తించగలవని ఆయన తెలిపారు. అయితే యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. వివిధ రకాల రోగాల మధ్య వ్యత్యాసాన్ని శునకాలు కనిపెట్టగలవో లేదో తెలుసుకునేందుకు కొత్త ఆధ్యయనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.